Mythological Movies: ప్రస్తుతం టాలీవుడ్ మైథాలజీ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. భక్తి కథలతో తెరకెక్కిన సినిమాలు వందల కోట్ల వసూళ్లను రాబడుతుండటంతో చిన్న హీరోలు మొదలుకొని అగ్ర కథానాయకుల వరకు అందరూ ఈ భక్తి కథలపై ఆసక్తిని చూపుతున్నారు. మైథాలజీ కాన్సెప్ట్‌లతో వచ్చిన హనుమాన్, కార్తికేయ 2తో పాటు ఇటీవల రిలీజైన మిరాయ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. డబ్బింగ్ సినిమాలు కాంతార, మహావతార్ నరసింహా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ విజయాలతో మైథాలజీ సినిమాలు సంఖ్య పెరిగింది. ప్రస్తుతం డివోషనల్ కాన్సెప్ట్‌లతో పలు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
చిరంజీవి… బాలకృష్ణ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ మూవీ పురాణాల్లోని పధ్నాలుగు లోకాల కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. స్వప్నలోకం చుట్టూ విశ్వంభర స్టోరీ సాగుతుందని దర్శకుడు వశిష్ట తెలిపాడు. సినిమా కాన్సెప్ట్ మొత్తం పౌరాణిక అంశాలతోనే ముడిపడి ఉంటుందట.
బాలకృష్ణ అఖండ 2లో డివోషనల్ టచ్ ఉంటుందని సమాచారం. టీజర్‌లో అఘోర గెటప్‌లో బాలకృష్ణ కనిపించారు. దేవుడి సహాయంతో చెడుపై పోరాడే ఓ వ్యక్తి కథతో అఖండ 2 తెరకెక్కుతున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ 2 డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలోకి రాబోతుంది.
Also Read – CBSE New Guidelines: విద్యార్థులకు షాకింగ్ న్యూస్..75 శాతం హాజరు తప్పనిసరి!
జై హనుమాన్…
బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్‌కు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో కన్నడ నటుడు రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తున్నాడు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? యుగాల తర్వాత హనుమంతుడి కోరికను రాముడు ఎలా నెరవేర్చాడు అనే కాన్సెప్ట్‌తో జై హనుమాన్ సాగుతుందని అంటున్నారు. వాయుపుత్ర పేరుతో డైరెక్టర్ చందూ మొండేటి త్రీడీ మైథాలజీ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
రాముడిగా మహేష్‌బాబు…
మహేష్‌బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీలో పురాణాలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఓ సీన్‌లో మహేష్‌బాబు రాముడిగా కనిపిస్తాడని అంటున్నారు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ డివోషనల్ జానర్‌లో ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. యుద్ధ దేవుడిగా పురాణాల్లో ప్రసిద్ధి చెందిన కుమారస్వామి చరిత్రతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది. ఇవే కాకుండా నాగచైతన్య, కార్తీక్ దండు మూవీ, సుధీర్‌బాబు జఠాధరతో పాటు పలు సినిమాలు డివోషనల్ కాన్సెప్ట్‌లతో రూపొందుతున్నాయి.
Also Read – YS Jagan fire: “మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు.. బాబుగారూ!”


