Naga Vamsi: నిర్మాత నాగ వంశీకి ఉన్న ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి మొహమాటం లేకుండా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆయన స్టైల్. తాజాగా, రవితేజ హీరోగా వస్తున్న ‘మాస్ జాతర’ సినిమా ప్రమోషన్లలో భాగంగా, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించిన మలయాళ చిత్రం ‘లోక చాప్టర్ 1 చంద్ర’, తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో డబ్బింగ్ అయ్యి విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నాగ వంశీ సంచలన కామెంట్స్ చేశారు.
‘లోక’ సినిమాను డైరెక్ట్‌గా తెలుగులో తీసి ఉంటే, కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది. ‘లాగ్ ఉంది, అది లేదు, ఇది లేదు’ అని మనవాళ్లు తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను” అంటూ కుండబద్దలు కొట్టారు. మంచి కంటెంట్‌ను కూడా తెలుగు ప్రేక్షకులు ఎలా విమర్శిస్తారో చెప్పడానికి ఆయన ఈ ఉదాహరణను తీసుకున్నారు. వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను సైతం, తెలుగులో ఒరిజినల్‌గా తీస్తే మాత్రం విమర్శకుల దృష్టి నుంచి తప్పించుకోవడం కష్టమని ఆయన ఉద్దేశం.
నిజానికి, ‘లోక’ చిత్రానికి మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చి, పెద్ద విజయాన్ని సాధించింది. అయితే, తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌కు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో, నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్, తెలుగు ప్రేక్షకుల సినిమా అభిరుచి, అలాగే సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ గురించి చర్చకు దారి తీశాయి.
ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా హీరో రవితేజతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక పెద్ద నిర్మాత ఇంత ఓపెన్‌గా మాట్లాడటం, ముఖ్యంగా ప్రేక్షకుల విమర్శనా ధోరణి గురించి మాట్లాడటం ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపింది.


