Nani Sujeeth Film: ఓజీ మూవీతో కెరీర్‌లోనే పెద్ద హిట్‌ను అందుకున్నాడు డైరెక్టర్ సుజీత్. పవన్ కళ్యాణ్ హీరోగా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. నాలుగు రోజుల్లోనే 250 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. డైరెక్టర్‌గా సుజీత్ టేకింగ్‌పై ప్రశంసలు కురుస్తోన్నాయి. ఓజీలో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను స్క్రీన్‌పై సుజీత్ ఆవిష్కరించాడని అంటున్నారు. పవన్ ఎలివేషన్లు, హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించాడని కామెంట్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా ఓజీ నిలిచింది.
నానితో నెక్స్ట్ మూవీ…
ఓజీకు ముందు ప్రభాస్‌తో సాహో సినిమా చేశాడు సుజీత్. సాహో ఫెయిల్యూర్‌గా నిలవడంతో సుజీత్ కెరీర్‌కు ఆరేళ్లు గ్యాప్ వచ్చింది. ఈసారి మాత్రం గ్యాప్ ఎక్కువగా తీసుకోకుండా తన నెక్స్ట్ మూవీ మొదలుపెట్టబోతున్నాడు. ఓజీ తర్వాత హీరో నానితో సుజీత్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా లాంఛింగ్ డేట్ ఫిక్సయ్యింది. దసరా కానుకగా అక్టోబర్ 2న నాని, సుజీత్ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఈ రోజు లేదా రేపు రావచ్చునని అంటున్నారు.
Also Read- Chiru OG Review: హాలీవుడ్ రేంజ్‌లో ఉంది – పవన్ కళ్యాణ్ ఓజీపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ
డార్క్ హ్యూమర్ కాన్సెప్ట్…
ఓజీ, సాహో సినిమాలకు భిన్నంగా డార్క్ హ్యూమర్ కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నాని, సుజీత్ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ సినిమాల స్టైల్‌లో ఉండబోతున్నట్లు చెబుతున్నారు. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుందట. షూటింగ్ మొత్తం ఫారిన్‌లోనే జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందట.
బ్లడీ రోమియో…
నాని, సుజీత్ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. నాని కెరీర్‌లోనే మోస్ట్ స్టైలిష్ మూవీగా ఉంటుందని అంటున్నారు. ఓజీ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో సీనియర్ నటుడు మోహన్‌బాబు విలన్‌గా కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. కాగా ఓజీకి సీక్వెల్‌గా ఓజీ 2 కూడా రాబోతుంది. నానితో సినిమా ముగిసిన తర్వాత ఈ సీక్వెల్ సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం.


