Nayanthara Legal Issue: స్టార్ హీరోయిన్ నయనతార నిజ జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. 2024 నవంబర్ 18న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ డాక్యుమెంటరీ, ఆమెను మరోసారి వార్తల్లో నిలిపింది. ఇప్పటికే, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ డాక్యుమెంటరీపై కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా, ఆయన నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ (Naanum Rowdy Dhaan) సినిమా ఫుటేజ్‌ను ఉపయోగించారని ఆయనే లీగల్ నోటీసులు పంపించారు. కేవలం మూడు సెకన్ల క్లిప్ కోసం రూ. 10 కోట్లు చెల్లించాలని ధనుష్ డిమాండ్ చేయడం గమనార్హం. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
తాజాగా, ఈ వివాదానికి ‘చంద్రముఖి’ సినిమా మేకర్స్ కూడా తోడయ్యారు. ఈ డాక్యుమెంటరీలో రజినీకాంత్ (Rajinikanth), నయనతార కలిసి నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi) మూవీ సీన్స్‌ను తమ అనుమతులు లేకుండా యాడ్ చేశారని వారు తీవ్రంగా స్పందించారు. ఈ సీన్స్‌ను తొలగించాలని ఇప్పటికే నోటీసులు పంపినా, డాక్యుమెంటరీ మేకర్స్ స్పందించలేదట. దీంతో, చంద్రముఖి సినిమా కాపీరైట్స్ పొందిన ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. తమ అనుమతి లేకుండా సినిమా సన్నివేశాలను ఉపయోగించినందుకు రూ. 5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఏబీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది.
Also Read – Soubin Shahir: సినిమాల్లో లాభాలంటూ మోసం – కూలీ మూవీ నటుడు అరెస్ట్
ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు (Madras High Court), డాక్యుమెంటరీ మేకర్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. రెండు వారాల్లోగా ఈ వివాదంపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా, డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత ఎంత ఆదాయం వచ్చిందో కూడా వెల్లడించాలని హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒకవైపు ధనుష్ (Dhanush), మరోవైపు చంద్రముఖి మేకర్స్‌తో న్యాయపోరాటం ఎదుర్కొంటున్న నయనతార డాక్యుమెంటరీ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుల విచారణ ఫలితాలు డాక్యుమెంటరీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం ఈ లీగల్ చిక్కులే హాట్ టాపిక్‌గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. యష్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్స్ లో (Toxic) నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. మలయాళ స్టార్ మోహన్‌లాల్ ‘పేట్రియాట్స్’ సినిమాతో పాటు నయన్ లీడ్ రోల్‌లో రూపొందుతోన్న ‘రక్కాయి’, ‘మూకుతి అమ్మన్ 2’, ‘డియర్ స్టూడెంట్స్ సినిమాల్లో నటిస్తుంది. తెలుగు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబోలో రూపొందుతోన్న మెగా 157లోనూ కథానాయికగా నటిస్తుంది.
Also Read – India Lost Rafale Fighter : భారత్ ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది.. కానీ శత్రుదాడిలో కాదు!


