మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఒక కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్.. చిరంజీవితో సినిమా అనగానే మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే మూవీ యూనిట్ కూడా జాగ్రత్త పడుతోంది. తాజాగా ఈ సినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతారను(Nayanthara) హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈమేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా పోస్టర్ విడుదల చేయడంతో పాటు ఓ ప్రోమోను కూడా విడుదల చేసింది.
ఇందులో వచ్చే సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామ్ అని నయన్, అనిల్ కలిసి చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఇక వీడియో చివర్లో చిరంజీవి మేనరిజంలో ‘‘హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా ’’ అంటూ ఆమె చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాల్లో చిరు-నయన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.


