సోషల్ మీడియాలో హీరోయిన్లను వేధించడం కామన్ అయిపోతుంది. కొంతమంది ఆకతాయిలు రకరకాల కామెంట్స్, పోస్టులతో వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇటీవల కేరళ హీరోయిన్ హనీరోజ్ ఇలాంటి వేధింపులను ఎదుర్కోగా.. తాజాగా నిధి అగర్వాల్(Nidhhi Agerwal) ఈ బెదిరింపుల బారిన పడ్డారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో నిధి అగర్వాల్‌ని చంపేస్తానని కామెంట్స్ చేస్తున్నాడు. దీనిపై ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని, తనతో పాటు తన కుటుంబసభ్యులను కూడా టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాను అని వాపోయాయింది. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’, పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. కాగా తెలుగులో చైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది.