టాలీవుడ్ హీరో నితిన్(Nithiin) తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు నితిన్‌కు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నితిన్‌తో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఉన్నారు.
కాగా నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీంతో సినిమా హిట్ కావాలని స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు నితిన్ తెలిపారు. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. శ్రీలీల కథానాయికగా నటించింది. ఇక రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.