Prashanth Varma: నాని నిర్మాతగా 2018లో వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘అ’ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ అనే సినిమాను తీసి హిట్ అందుకున్నాడు. ఈ చిత్రాలతో అందరి దృష్ఠిని ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ గత చిత్రం ‘హనుమాన్’ సక్సెస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో సంచలనమయ్యాడు. యంగ్ హీరో తేజ సజ్జాని పెట్టుకొని ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 350 కోట్లు వసూళ్లు సాధించడం అందరికీ షాకింగా అనిపించింది.
‘హనుమాన్’ సినిమాతో మిగతా భాషలలోనూ ప్రశాంత్ పేరు మార్మోగింది. దీంతో మన హీరోలందరూ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. నిర్మాతలు కూడా అడ్వాన్సులు అలాగే ఇచ్చి కూర్చున్నారు. అంతేకాదు, ప్రశాంత్ నుంచి కూడా సినిమా అనౌన్స్ మెంట్లు వరుసగా వచ్చాయి. కానీ, ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ ఏ సినిమా చేస్తున్నాడు.. ముందు ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది..? ఆ సినిమాకి ఆయన దర్శకుడా? లేక నిర్మాతనా? అనేది అసలు క్లారిటీ లేదు.
Also Read – Job Calendar is delayed: జాబ్ క్యాలెండర్‌కు కాలదోషం
ప్రశాంత్ వర్మ తన సొంత బ్యానర్ లో ‘మహాకాళీ’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. అధికారికంగా కూడా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. కానీ, ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చిందా? లేదా? అన్నది తెలీలేదు. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ నిర్మాత మాత్రమే. ఇక బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్’ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమాన్ గా కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రిషబ్ పస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందా.. లేదా అన్నది సస్పెన్స్ గా ఉంది. అంతేకాదు, బాలయ్య కొడుకు మోక్షజ్ఞని పరిచయం చేసేది ప్రశాంత్ వర్మ అన్నారు. అలాగే, బాలయ్యని డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడా క్లారిటీ మిస్.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అగ్ర నిర్మాత డీ.వీ.వీ దానయ్య కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ‘అధీర’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటన ఎప్పుడో వచ్చింది. కానీ, ఈ మధ్య ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అప్‌డేట్ కూడా లేదు. పైగా ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కాదని, ఆయన స్థానంలో మరో దర్శకుడు వచ్చాడని వార్తలు వినిపించాయి. ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుంది అని ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా ఇప్పట్లో ఉండదని అందరికీ పక్కా క్లారిటీ ఉంది. మరి, ప్రశాంత్ వర్మ లైనప్ ఏంటో ఆయన సినిమాల పరిస్థితేంటి అనేది స్వయంగా ఆయనే వెల్లడించాలి. లేదంటే సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతాయి.
Also Read – Coolie Spider OTT : ఓటిటీలోకి రెండు బాక్ బ్లస్టర్ హిట్స్.. కూలీ, స్పైడర్!


