Pawan Kalyan OG Movie: పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకునే ప్రతిసారీ ఒక మాట వింటుంటాం. ఆయనకి విజయం అంత ఈజీగా రాదు కానీ వచ్చినప్పుడు ఆ హై మామూలుగా ఉండదు. సినిమా అయినా సరే రాజకీయాలే అయినా సరే ఆయనకి ఒక ఫైటర్ స్పిరిట్ ఉంటుంది. ఓడినా అక్కడి నుంచి మళ్లీ లేచి నిలబడతాడు, గెలిచాక అభిమానుల్ని గర్వపడేలా చేస్తాడు. అదే స్పిరిట్ మళ్లీ ‘ఓజీ’ సినిమాతో కనిపించింది.
జనసైనికులే కాకుండా..
ఓజీ విడుదలకంటే ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జనసైనికులే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూశారు. పవన్ కళ్యాణ్‌ని రీమేక్ సినిమాలో కాకుండా పూర్తిగా ఒరిజినల్ స్టోరీలో మాస్ లుక్‌లో చూడాలని కలలు కన్న అభిమానుల కోరిక ఈ సినిమాతో నెరవేరింది. దర్శకుడు సుజీత్ పవన్‌ని గ్యాంగ్‌స్టర్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయేలా చేశాడు.
సింపుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా..
కథ పరంగా చూస్తే ఇది ఒక సింపుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. వర్తమానంలో సాధారణ జీవితాన్ని గడిపే హీరో గతంలో డాన్‌గా ఉండేవాడు. తన కుటుంబానికి ప్రమాదం తలెత్తినప్పుడు మళ్లీ అతనిలోని పాత డాన్ మేల్కొని శత్రువులని ఒక్కొక్కరినీ చిత్తు చేస్తాడు. ఇది లైన్ సింపుల్ అయినా సుజీత్ స్క్రీన్ ప్లే అలా మలిచాడు కాబట్టి కథలో హై టెన్షన్ మూడ్ కొనసాగుతుంది.
ప్రేమ కోసం..
సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు గంభీరుడు. రాజు పాత్రలో ప్రకాష్ రాజ్, ప్రతినాయకుడిగా ఓమి భావు పాత్రలో ఇమ్రాన్ హష్మీ మెరిశారు. కథలో రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి గంభీరుడిని ఆశ్రయిస్తాడు. అతని సహాయం వల్ల శత్రువులు తల దించుకుంటారు. కానీ గంభీరుడు ప్రేమ కోసం దూరమవుతాడు. అదే శత్రువుల దాడికి కారణమవుతుంది. ప్రేమని కోల్పోయిన గంభీరుడు చివరికి మళ్లీ యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధం ముంబై వీధుల్లో రక్తపాతం సృష్టిస్తుంది. అదే ఓజీ.
గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే బ్లడ్‌షెడ్, హింసాత్మక సన్నివేశాలు ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ సుజీత్ చెప్పే తీరు వేరుగా ఉంది. కథ కాంప్లికేటెడ్‌గా కాకుండా ఎవరికైనా అర్థమయ్యేలా సింపుల్‌గా చెప్పాడు. అందుకే మాస్ ప్రేక్షకులే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకర్షితులవుతున్నారు.
పవన్ ఎంట్రీ సినిమాలో ఆలస్యంగానే ఉంటుంది. కానీ కనిపించిన ప్రతిసారీ థియేటర్లలో హంగామా మామూలుగా లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ పవన్ కెరీర్‌లోనే హైలైట్ సీన్‌గా నిలిచింది. అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా లేచి కేకలు వేయించేంత పవర్‌ఫుల్‌గా ఉంది ఆ సన్నివేశం.
సెకండాఫ్‌లో కథ కొంచెం నెమ్మదించినా పవన్ ఎలివేషన్స్ ఆ లోపాన్ని కప్పేశాయి. పోలీస్ స్టేషన్ సీన్, జపాన్ ఫైట్, ముంబై రీఎంట్రీ ఇలా ప్రతి పది నిమిషాలకోసారి పవన్‌కు భారీ ఎత్తున హై మూమెంట్స్ ఇచ్చారు. లాజిక్స్ కంటే ఎలివేషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఫ్యాన్స్‌కి ఐఫీస్ట్‌గా తయారైంది.
పాత జ్ఞాపకాలు…
సినిమాలో పలు చోట్ల పవన్ పాత సినిమాల రిఫరెన్సులు వాడారు. జానీ, ఖుషీ, బద్రి గుర్తుకు వచ్చేలా కొన్ని సీన్స్ మలిచారు. వీటితో ఫ్యాన్స్‌కి పాత రోజుల జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. కథ పరంగా కొత్తదనం లేకపోయినా పవన్ స్టైల్, స్వాగ్ సినిమాని భిన్నంగా నిలబెట్టాయి.
ప్రకాష్ రాజ్, పవన్ కాంబినేషన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిజజీవితంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ తెరపై అద్భుతమైన కెమిస్ట్రీ కనబడింది. ఆ సన్నివేశాల్లో పవన్‌కి వచ్చిన ఎలివేషన్స్ థియేటర్లలో గోల చేయించాయి.
హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ కన్మణి పాత్రలో కనిపించింది. భర్తని కన్ను రెప్పలా కాపాడుకునే భార్యగా తన పాత్రకి న్యాయం చేసింది. పవన్‌తో జంటగా కూడా బాగానే సరిపోయింది. ప్రతినాయకుడిగా ఇమ్రాన్ హష్మీ స్టైలిష్ లుక్‌తో, హీరోకి పోటీ వచ్చేలా అందరిని ఇంప్రెస్ చేశాడు.
Also Read:https://teluguprabha.net/devotional-news/navratri-day-three-annapurna-devi-significance-explained/
ఈ సినిమాలో తారాగణం చాలా పెద్దది. అర్జున్ దాస్, శ్రియారెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, సుభలేఖ సుధాకర్, సుహాస్, రాహుల్ రవీంద్రన్ ఇలా పలువురు నటులు కీలక పాత్రల్లో మెరిశారు. వీళ్లందరి నటన సినిమాకి మరింత బలం చేకూర్చింది.
టెక్నికల్ విభాగాల్లో కూడా ఓజీ ప్రత్యేకంగా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి ప్రాణం పోశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్‌కి ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో వాతావరణాన్ని మారుస్తుంది. ఈ సినిమా తరువాత ఆయన పేరు మరింతగా మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు.
సినిమాటోగ్రాఫర్లు రవికే చంద్రన్, మనోజ్ పరమహంస విజువల్స్‌ని అద్భుతంగా క్యాప్చర్ చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో పీటర్ హెయిన్స్, స్టంట్స్ శివ హై స్టాండర్డ్స్‌ని చూపించారు. కొన్ని సీన్స్‌లో పవన్ డూప్ వాడినట్లు స్పష్టంగా కనబడినా మొత్తం మీద యాక్షన్ బ్లాక్స్ ఆకట్టుకుంటాయి.
ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా..
ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. నిర్మాత దానయ్య భారీ స్థాయిలో ఖర్చు చేసి సినిమాకి ఎక్కడా లోటు లేకుండా చేశారు.
మొత్తం మీద ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల కలలని నిజం చేసింది. గ్యాంగ్‌స్టర్ స్టోరీ, రక్తపాతం, హింస ఎక్కువగా ఉన్నప్పటికీ పవన్ స్టైల్, యాక్షన్, మాస్ ఎలివేషన్స్ కారణంగా ఈ సినిమా అభిమానులకు పండుగలా మారింది. సాధారణ ప్రేక్షకులకూ పాస్ మార్క్ తెచ్చిపెట్టే ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులు చెరిపేసే స్థాయిలో దూసుకెళ్తోంది.


