Allu Arjun: అల్లు అర్జున్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబానికి మళ్లీ క్షమాపణలు చెప్పారు. ఇది దురదృష్టకర ఘటన అని.. ఆ కుటుంబానికి జరిగిన దానికి తాను ఎంతగానో చింతిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో తన ప్రమేయం లేదని.. ఆ సమయంలో కుటుంబంతో కలిసి థియేటర్‌లో సినిమా చూస్తున్నానని పేర్కొన్నారు. ఏదేమైనా ఆ కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని అన్నారు.
గత 20 ఏళ్లుగా అదే సంధ్య థియేటర్‌కు 30 సార్లు వెళ్లానని.. కానీ, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఆమె కుటుంబాన్ని పరామర్శిస్తానని వెల్లడించారు. మళ్లీ మళ్లీ చెప్తున్నా ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా తాను ఉంటానని హామీ ఇచ్చారు. కేసు వివరాల గురించి ఇప్పుడేం మాట్లాడలేనని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అభిమానుల ప్రేమాభిమానాలతో తన హృదయం నిండిందని.. తనపై అపరిమితమైన ప్రేమ చూపించిన అభిమానాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.