పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్ కారణంగా ఎన్నోసార్లు వాయిదాపడిన ఈ మూవీ.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా దీనిపై ఓ అప్ డేట్ వచ్చింది. పవన్ కాల్షీట్లు ఇవ్వడంతో చిత్రీకరణ చివరి విడత షూటింగ్ వేగంగా జరగనుందంట.. మూడ్రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
క్రిష్, జ్యోతికృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా కథ పదిహేడు వ శతాబ్దం నాటి మొఘల్ రాజవంశం, కుతుబ్ షాహీల చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని సాగనుంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక వీరుడిగా, వజ్రాల దొంగగా కనిపించనున్నాడు. మొఘలాయిలకు వ్యతిరేకంగా పోరాడే అజేయ వీరునిగా పవన్ స్క్రీన్‌పై దర్శించబోతున్నాడు.
మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, మొదటి భాగానికి ‘Hari Hara Veera Mallu: Part 1 – Sword vs Spirit’ అనే టైటిల్ ఖరారు చేశారు. షూటింగ్ ముగింపు దశలో ఉండగానే, నిర్మాణ బృందం పారల్లెల్‌గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించిందట. సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.
ఈ చిత్రం ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గిస్ ఫఖ్రీ నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి, జిషు సేన్ గుప్తా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం 6 భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లో భారీ అనుభూతిని ఇవ్వబోతుందని టీమ్ చెబుతోంది. అంతే కాదు, పవన్ ఇమేజ్‌కు సరిపోయేలా చారిత్రక విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ బ్లాక్స్ అన్ని పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇన్ని హైలైట్స్ ఉన్న ఈ మూవీతో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ రికార్డులు బ్రేక్ చేస్తాడో.. ఎంతటి ప్యాన్ ఇండియా క్రేజ్‌ను సంపాదిస్తాడో చూడాలి మరి.