OG Movie Trailer Launch: గత కొన్ని రోజులుగా రేపు మాపు అని ఊరిస్తూ వస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజైంది. పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌కు తగ్గట్లుగా అభిమానులు మెచ్చే విధంగా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకొని అంచనాలను పెంచేసింది. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఓజీ చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వాయిదా పడి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇక రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో తాజగా ఓజీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పవన్‌ను అభిమానులు ఎలాగైతే చూడాలనుకున్నారో అలాగే చూపించాడు డైరెక్టర్ సుజిత్. గ్యాంగ్ స్టర్‌గా పవర్ స్టార్ లుక్, స్టైల్, డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్‌ను గూస్‌బంప్స్ వచ్చేలా తీర్చిదిద్దారు. ఇక ఎప్పట్లాగే తనదైన శైలిలో పవర్‌ఫుల్ బీజీఎంతో దుమ్ముదులిపేశాడు తమన్. మొత్తానికి, తాజా ట్రైలర్‌తో ఓజీపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. పవన్ కు బ్లాక్ బస్టర్ పడినట్టేనని అభిమానులు సంబరపడుతున్నారు. సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఓమీ గా విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే సీనియర్ నటి శ్రియా, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.
వర్షంలోనూ జోరుగా ప్రీరిలీజ్ ఈవెంట్..
సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21) సాయంత్రం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవేంట్‌కు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు రావడంతో పవన్ కల్యాణ్ సైతం వర్షంలోనే స్పీచ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన షూటింగులో బిజీగా ఉండటంతో రాలేదని తెలుస్తోంది. ప్రముఖ సినీ నటులు, ఓటీ టీమ్ ఈ ఈవెంట్ లో సందడి చేసింది.


