Hari Hara Veera Mallu Ott date: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 24న రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించినప్పటికీ హిందీ, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కాలేదు. ఆ విషయాలను పక్కన పెడితే.. సినిమా భారీ అంచనాలతో రిలీజైంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలను రాబట్టుకోలేదు. ప్రేక్షకులే కాదు..ఫ్యాన్స్ కూడా సినిమా ఫలితంపై పెదవి విరిచారు.
సినిమా కథ విషయాన్ని ఎవరూ తప్పు పట్టకపోయినా, గ్రాఫిక్స్ విషయంలో ‘హరిహర వీరమల్లు’పై వచ్చినన్ని విమర్శలు మరే సినిమాపై రాలేదు. తాజాగా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఆగస్ట్ 20 నుంచి ‘హరిహర వీరమల్లు’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనే మూవీ స్ట్రీమింగ్ కానుంది. మరి హిందీ, కన్నడలో ఎందుకు స్ట్రీమింగ్ కావటం లేదనేది మేకర్సే చెప్పాలి.
తొలి హిస్టారికల్ మూవీ..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కెరీర్‌లో నటించిన తొలి హిస్టారికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ ఇది. సనాతన ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కనిపించారు. 17వ శతాబ్దంలో హిందువులు హింసించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని ఎదిరించే వీరుడి పాత్రలో పవన్ కనిపించారు. దీన్ని రెండు భాగాలుగా అనుకున్నారు. తొలి భాగం రిలీజై నష్టాలను చవిచూసింది. మరిప్పుడు సెకండ్ పార్ట్ సెట్స్ పైకి వెళ్లటం అనుమానమే. పవన్‌కు జోడీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) నటించగా, ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) నటించాడు.
ఐదేళ్ల తర్వాత…
ఐదేళ్లు ముందు స్టార్ట్ చేసిన ‘హరిహర వీరమల్లు’.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లటం, ఎన్నికలు, కరోనా, వరదల్లో సెట్స్ కొట్టుకుపోవటం వంటి కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు సినిమాను స్టార్ట్ చేసిన దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో జ్యోతికృష్ణ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేశారు. పవన్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత ఈ సినిమా రిలీజైంది. పవన్ ఉప ముఖ్యమంత్రిగా మారిన తర్వాత కూడా, బిజీ షెడ్యూల్‌లోనూ ఈ సినిమా కోసం కొన్ని రోజులు డేట్స్ కేటాయించి మరీ కంప్లీట్ చేశారు. అయితే మూవీ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.


