Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉంటూనే ఇప్పుడు ఎన్నడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను చేస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన పవన్.. ఇప్పుడు అదే జోష్ లో వరస సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ మధ్యనే డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుపుకొని పోస్టర్లు కూడా వచ్చేశాయి. మరోవైపు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలపై ఎక్కడలేని అంచనాలు మొదలయ్యాయి. గతంలో పవన్ కళ్యాణ్, హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత హిట్టయ్యిందే తెలిసిందే.
అందుకే హరీష్ శంకర్ తో సినిమా అనగానే అభిమానులు ఏదేదో ఊహించేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే ఖరారైందని ఈ మధ్య ప్రచారం జరిగింది. యూనిట్ కూడా దాన్ని ఖండించలేదు. కానీ.. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు నుండి పూజ తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. పూజ హెగ్డే మాత్రం ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
తెలుగులోనే కాకుండా హిందీలో సినిమాలను చేస్తూ బిజీగా ఉన్న పూజా.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న SSMB 28 సినిమాతో పాటు హిందీలో సల్లు భాయి సరసన కూడా నటిస్తుంది. మూడు, నాలుగు సినిమాలే చేతిలో ఉండడంతో పవన్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమేమీ కాదు. కానీ.. కారణమేంటో తెలియదు కానీ ఈ సినిమా నుండి పూజా తప్పుకున్నట్లు తెలుస్తుంది.