Saturday, July 27, 2024
Homeచిత్ర ప్రభPosani: రంగస్థల సమాజాలకు వైఎస్సార్ పురస్కారం

Posani: రంగస్థల సమాజాలకు వైఎస్సార్ పురస్కారం

నాటక రంగ కళాకారులకు అందజేసే ఎన్.టి.ఆర్.రంగస్థల పురస్కారం కొనసాగుతుంది

తెలుగు నాటక రంగం ప్రోత్సాహానికి, అభివృద్దికి విశేషంగా కృషిచేస్తున్న రంగస్థల సమాజాలకు, పరిషత్ లకు ఈ ఏడాది నుండి వైఎస్సార్ రంగస్థల పురస్కారం క్రింద రూ.5.00 లక్షల నగదు బహుమతిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర పిల్ము, టివి మరియు థియేటర్ డవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో నాటక రంగ అభివృద్దికి విశేష కృషిచేశారన్నారు. 2004 సంవత్సరం వరకూ నంది నాటక అవార్డులకై ఎంపిక కార్యక్రమం హైదరాబాదు రవీంద్రభారతిలోనే జరుగుచుండేదన్నారు. ఈ నాటక పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు కళాకారులు అంతా హైదరాబాదుకు వచ్చేందుకు పలు వ్యయప్రయాసలను ఎదుర్కోవడం జరిగేదన్నారు. అయితే ఈ సమస్యను గుర్తించిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలోని పలు ముఖ్య కేంద్రాల్లో నూతన ఆడిటోరియంలను కట్టించడమే కాకుండా, ఉన్న వాటిని పునరుద్దరించారన్నారు. అప్పటి నుండి నంది నాటక పోటీలను ఆయా ప్రాంతాల్లో నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని కళాకారుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి విశేషంగా కృషిచేసిన స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరుతో వైఎస్సార్ రంగస్థల పురస్కారాన్ని ఈ ఏడాది నుండి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ పురస్కారం క్రింద తెలుగు నాటక రంగం ప్రోత్సాహానికి, అభివృద్దికి విశేషంగా కృషిచేస్తున్న రంగస్థల సమాజాలకు, పరిషత్ లకు రూ.5.00 లక్షల నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబందించిన ప్రక్రియను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని, ఉత్తమమైన రంగస్థల సమాజాలను, పరిషత్ లను ఎంపిక చేసేందుకు ముగ్గురు న్యాయ నిర్ణేతలను కూడా ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో నాటక రంగ కళల ప్రోత్సాహం, అభివృద్ది కోసం విశేషంగా కృషిచేసే నాటక రంగ కళాకారులకు ఇప్పటి వరకూ అందజేస్తున్న ఎన్.టి.ఆర్.రంగస్థల పురస్కారాలను కూడా కొనసాగిస్తున్నామని, ఇందుకై రూ. 1.50 లక్షల నగదు బహుమతిని అందజేయడం జరుగుచున్నదన్నారు.

- Advertisement -

నంది నాటక అవార్డులకు తుది ఎంపిక గుంటూరు పట్టణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు……

నంది నాటక అవార్డులకు సంబందించి ప్రాధమిక ఎంపిక పూర్తయిందని,  ఈ ప్రాధమిక ఎంపికలో మొత్తం 115 నాటకాలు, నాటికల ప్రదర్శనను పరిశీలించి అందులో 38 నాటకాలు, నాటికలను తుది ప్రదర్శనకు ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ తుది ప్రదర్శన ఎంపిక కార్యక్రమాన్ని వచ్చే నెల చివరి వారంలో గాని  డిశంబరు మొదటి వారంలో గానీ గుంటూరు పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ తుది ఎంపికలో ఎటు వంటి విమర్శలకు, ఆరోపణలకు తావులేకుండా ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు త్వరలో ముగ్గురు న్యాయ నిర్ణేతలను ఎంపిక చేయనున్నామని, వారి బయోడేటాను కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుందన్నారు. 

కళాకారుల గుర్తింపు కార్డులకై ఈ నెల 15 నుండి ఆన్ లైన్ ధరఖాస్తు చేసుకునే అవకాశం……

రాష్ట్రంలోని కళాకారులు అందరికీ ప్రత్యేకించి జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు గుర్తింపు కార్డులు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అర్హులు అయిన వారు ఈ నెల 15 నుండి ఆన్ లైన్ లో ధరఖాస్తుచేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టి.వి. మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ అఫీషియల్ వెబ్ సైట్ అయిన www.apsftvtdc.in లో ఈ నెల 15 నుండి ధరఖాస్తుచేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ వెబ్ సైట్ ద్వారా అందిన ధరఖాస్తులను అన్నింటినీ క్షణ్ణంగా పరిశీలించి అర్హులకు గుర్తింపు కార్డులను జారీచేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ కళాకారుల వివరాలను అన్నింటినీ ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని, వీరి సేవలు ఎవరికైనా అవసరమైతే వెంటనే వారిని నేరుగా సంప్రదించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అదే విధంగా ఏజంట్ల ప్రమేయం ఏమాత్రం లేకుండా సినిమా నిర్మాతలకు, దర్శకులకు ఎటు వంటి కళాకారులు కావాల్సి ఉన్నా నేరుగా వారి వివరాలను ఈ వెబ్ సైట్ నుండి పొంద వచ్చన్నారు. తద్వారా కళాకారులు ఆయా సినిమా నిర్మాతలు, దర్శకుల నుండి నేరుగా జీవనోపాది పొందేందుకు అవకాశం ఏర్పడు తుందన్నారు. అదే విధంగా ఏజంట్లకు ఎటు వంటి కమిషన్ చెల్లించాల్సిన పరిస్థితి కూడా తలెత్తదని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News