Power Star OG Mania EveryWhere: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూవీ “ఓజీ” మేనియా చూస్తుంటే, “ఖుషి” సినిమా రోజులు గుర్తుకు వస్తున్నాయి. 2000 సంవత్సరంలో “ఖుషి” సినిమా రిలీజయ్యాక పవన్‌కు వచ్చిన క్రేజ్, ఇమేజ్ చూసి టాలీవుడ్ అంతా షేకైపోయింది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సిని మాల్లోకి అడుగుపెట్టి, ఆయనకే ప్రధాన పోటీదారునిగా మారాడంటూ పవన్‌ని అందరూ ఆకాశానికెత్తేసిన సందర్భం అది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ వైబ్.. “ఓజీ” మూవీకి కనిపిస్తోంది. పవన్ ఫ్యాన్స్ అయితే వేరే పనిలేనట్లు ఓజీ మేనియాతో ఊగిపోతున్నారు. “ఖుషి కాలం నాటి జోష్‌ను మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను” అని రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ అన్నది అందుకే. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదలవుతున్నప్పటికీ, సెప్టెంబర్ 24 రాత్రే ప్రీమియర్స్ రూపంలో మన ముందుకు వస్తున్నాడు “ఓజీ”. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ పరంగా ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోన్న “ఓజీ” ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్‌తో కలిపి మొదటిరోజు రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును సునాయాసంగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి.
Also Raed: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-latest-og-movie-trailer-launch/
కెరీర్‌లో ఫస్ట్‌టైం రూ. 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్..
కాగా, ఇప్పటివరకు పవన్ కెరీర్‌లో రూ. 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ అనేది లేదు. టాలీవుడ్ స్టార్స్‌లో ప్రభాస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాత్రమే రూ. 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌ను సాధించారు. అసాధ్యమనుకొనే రూ. 200 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌నూ ఈ నలుగురే అందుకున్నారు. కాకపోతే “బాహుబలి 2” మూవీతో ప్రభాస్, “పుష్ప 2” మూవీతో అల్లు అర్జున్ సోలోగా ఈ ఫీట్‌ను సాధిస్తే, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” మూవీతో జాయింట్‌గా ఈ ఘనత సాధించారు. ఇప్పుడు సుజీత్ డైరెక్ట్ చేసిన ఓజీ మూవీతో రూ. 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ క్లబ్బులో పవన్ కల్యాణ్ చేరడం దాదాపు ఖాయమైనట్లే. అయితే, అది ఏ రేంజ్ ఓపెనింగ్ అవుతుందనే విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కొంతమంది ప్రీమియర్స్‌తో కలుపుకొని రూ. 150 కోట్ల గ్రాస్ మొదటిరోజు కలెక్ట్ చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే హిందీ వెర్షన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తుందనే అంశం ఇక్కడ కీలకం కాబోతోంది. నిజానికి ఓజీ మూవీలో హిందీ స్టార్ యాక్టర్ ఇమ్రాజ్ హష్మి విలన్‌గా నటించినప్పటికీ, బాలీవుడ్‌లో ఈ సినిమాని సరిగా ప్రమోట్ చేయలేకపోయారని అభిమానులే అసంతృప్తి చెందుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్లు షేర్ చేస్తున్న అభిప్రాయాలే దీనికి నిదర్శనం.
అధిరిపోయిన లుక్స్.. అందుకే ఈ క్రేజ్..
ఓజాస్ గంభీర క్యారెక్టర్‌లో పవన్ కల్యాణ్ లుక్ ఫ్యాన్స్‌ని మాత్రమే కాకుండా తెలుగు సినీప్రియులనందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోందనే విషయంలో ఏమాత్రం అనుమానాల్లేవు. మునుపటి సినిమా హరిహర వీరమల్లు ఎంతగా డిజప్పాయింట్‌మెంట్‌కు గురిజేసినా ఓజీకి ఇలాంటి క్రేజ్ రావడం పవన్ కల్యాణ్‌కి మాత్రమే చెల్లింది. బయ్యర్లు కూడా ఏమాత్రం సందేహాలు లేకుండా ఓజీపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫైర్‌స్టార్మ్ సృష్టిస్తుందో.. లెటజ్ వెయిట్ అండ్ సీ.


