Power Star Pavan Kalyan OG movie review: అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్-అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘ఓజీ’ పవర్ స్టార్ అభిమానుల అంచనాలను అందుకుంది. పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన దర్శకుడు సుజీత్ ఈ సినిమాని పూర్తిగా ‘ఫ్యాన్ బాయ్ మూమెంట్స్’తో నింపేశాడు. అడుగడుగునా క్లైమాక్స్‌ని మించిపోయే ఎలివేషన్స్‌తో ఓ అగ్ని తుఫాన్‌ను తెరపై ఆవిష్కరించారు. అయితే ఈ సినిమా కథా నేపథ్యం ఏంటి?.. సాధారణ ప్రేక్షకులను ఎలా అలరించింది. అసలు సినిమా బలం ఏంటి.. కథలో ఏమైనా బలహీనతలు ఉన్నాయా అనే అంశాలను సమీక్షకుడి దృష్టి కోణంలో తెలుసుకుందాం!
కథా నేపథ్యం: ‘ఓజాస్ గంభీర’ అలియాస్ ఓజీ (పవన్ కల్యాణ్) ఒకప్పుడు సత్య దాదా (ప్రకాశ్‌రాజ్)కి రక్షణగా నిలిచిన యోధుడు. శత్రు పన్నాగాల కారణంగా ఓజీ పదేళ్ల పాటు దాదాకి దూరమైతాడు. ఈ సమయంలో శత్రు మూక నాయకుడు ఓమి (ఇమ్రాన్ హష్మి) ముంబై అండర్ వరల్డ్‌ను అక్రమాలకు అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తాడు. దీంతో రాజుకీ, రాజ్యానికీ కష్టం వచ్చిందని తెలిసిన ఓజీ.. తిరిగి ముంబైకి వస్తాడు. ఆ తర్వాత తన దాదాను కాపాడడానికి క్రూరమైన శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే అసలైన కథా. అయితే జపాన్‌లోని సమురాయ్ వంశానికీ ఓజీతో ఉన్న సంబంధం గురించి దర్శకుడు అభిమానుల ఊహకు అందని రీతిలో కథను తెరపై చూపించాడు. ఓజీ పదేళ్ల తర్వాత కూడా శత్రువుల్ని ఎలా వణికించాడనేదే తెరపై చూడాల్సిందే.
ఎలివేషన్స్‌తో మెరిసిన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా: ‘ఓజీ’ పూర్తిగా పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కి మరియు ఆయన స్వాగ్‌కి తగ్గట్టుగా రూపొందించిన సినిమా. దర్శకుడు సుజీత్ ప్రతి ఫ్రేమ్‌ను స్టైలిష్‌గానే కాకుండా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. ఆరంభంలో జపాన్‌లోని యకుజా, సమురాయ్ వంశాలతో మొదలయ్యే కథ ప్రేక్షకుడిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ముంబైకి మారగానే పవన్‌కల్యాణ్ పరిచయ సన్నివేశాల నుంచి ఎలివేషన్స్ హంగామా మొదలవుతుంది. ముంబై అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన ఓజీ గతం, పదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన సన్నివేశాలతోపాటుగా యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాపై బలమైన ముద్ర వేశాయి.
కథ పరంగా చూస్తే: విరామానికి ముందు, ఆ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్‌లో జరిగిన పలు సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ఇవన్నీ పవన్ అభిమానులను అమితంగా సంతృప్తి పరుస్తాయి. అయితే అభిమాని దృష్టితో కాకుండా.. కథ, డ్రామా పరంగా చూస్తే ఇంకాస్త బలంగా చూపించాల్సింది. కథనంలోని పలు ఉపకథలు కాస్త గందరగోళంగా అనిపిస్తాయి. ప్రకాశ్‌రాజ్-పవన్‌ల మధ్య అనుబంధం లాంటి భావోద్వేగ కోణాలు మరింత బలంగా ఉంటే బాగుండేది. అయినప్పటికీ.. పతాక సన్నివేశాలు ‘జానీ’ సినిమాని గుర్తుచేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతాయి.
Also Read:https://teluguprabha.net/cinema-news/og-review-pawan-kalyan-gangster-action-drama-impresses-fans/
పవన్ వన్ మేన్ షో: ‘ఓజీ’ చాలాసార్లు పవన్‌కల్యాణ్ వన్ మేన్ షోలా అనిపిస్తుంది. తెరపై ఆయన్ని ఆవిష్కరించిన తీరే దీనికి కారణం. ప్రథమార్ధంలో ఆయన చెప్పే డైలాగ్స్ తక్కువే అయినా.. ఆయన చేతిలోని ఆయుధాలైన కటానా, నాంచాక్, గన్, కత్తి మాట్లాడుతుంటాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించనంత స్టైలిష్‌గా పవన్ ఈ చిత్రంలో కనిపించారు. సినిమాలోని ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా ఉన్నాయి. విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి స్టైలిష్‌గా కనిపిస్తాడు. అయినా కథానాయకుడికి దీటుగా ఆ పాత్రను ఇంకాస్త బలంగా చూపించాల్సింది. కణ్మని, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి, సుదేవ్ నాయర్, అభిమన్యు సింగ్ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
సాంకేతిక అంశాలు: సాంకేతికంగా ఈ సినిమాకి అత్యధిక మార్కులు పడతాయి. ఎస్.ఎస్. తమన్ నేపథ్య సంగీతం (BGM) ఈ చిత్రానికి బలమైన హంగులను అద్దింది. ఆయన అందించిన మ్యూజిక్ ప్రతి ఎలివేషన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. రవి కె.చంద్రన్, మనోజ్ పరమహంస విజువల్స్ సినిమాకి మరో ఆకర్షణ. సుజీత్ స్టైలిష్ మేకింగ్‌తో పాటుగా ఉన్నతమైన నిర్మాణ విలువలు సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.
తీర్పు: ‘ఓజీ’ పూర్తిగా పవన్ కల్యాణ్ అభిమానులను సంతృప్తిపరిచే సినిమా. ఇది పూర్తిగా ఎలివేషన్స్ మరియు స్టైలిష్ యాక్షన్ ప్రధానంగా సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా. సాధారణ ప్రేక్షకుడిని మెప్పించాలంటే కథనం, డ్రామాపై ఇంకొంచెం దృష్టి పెట్టాల్సి ఉండే. అయినప్పటికీ పవన్ కల్యాణ్ స్వాగ్, తమన్ బీజీఎం మరియు స్టైలిష్ మేకింగ్ కోసం ఈ సినిమాను చూడవచ్చు.


