Pawan Kalyan: ‘‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను లక్షలాది మంది మధ్యలో జరుపుకోవాలనుకున్నాం. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా శిల్పకళావేదికలో నిర్వహించాల్సి వచ్చింది’ అని అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’ జూలై 24న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘రెండేళ్ల క్రితం భీమ్లా నాయక్ రిలీజైనప్పుడు అందరి సినిమా టికెట్స్ వందల్లో ఉంటే నా సినిమా టికెట్ పది రూపాయలు చేశారు. ఆరోజు నేను చెప్పింది ఒకటే ‘మనల్ని ఎవడ్రా ఆపేది’. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించలేదు. బ్రహ్మానందంగారు చెప్పినట్లు నేనేం కోరుకోలేదు. నేను సగటు మనిషిగా మాత్రమే బతకాలనుకున్నాను.
గుండెల్లో చేవ ఇంకా అలాగే ఉంది
నేను ఈరోజు నిలుచున్నాను. పడి లేచాను.. పడి లేచాను అంటే ఒకే ఒక కారణం అభిమానులే. కిందపడ్డా, లేచినా, ఉన్నా అన్నా, నీకు మేమున్నాం అంటూ ఫ్యాన్స్ నిలబడ్డారు. నా దగ్గర ఆయుధాలు లేవు, గుండాలు లేరు. మీరు తప్ప మరెవరూ లేరు. నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 29 నుంచి 30 సంత్సరాలు అవుతుంది. వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చేవ మాత్రం అలాగే బతికుంది. గబ్బర్ సింగ్ సినిమాకు మహబూబ్ నగర్ నుంచి వచ్చిన అభిమాని ఒక హిట్ ఇవ్వున్నా అని కోరుకున్నాడు. నేను దేవుడిని అలాగే కోరుకున్నాను. అది నిజమైంది. ‘హరిహర వీరమల్లు’ విషయానికి వస్తే చాలా కష్ట సమయంలో చేశాను.
నేను డబ్బుకి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు
సినిమా చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. జానీ సినిమా చేసినప్పుడు అది ఫెయిలైతే, వరుసగా హిట్స్ కొట్టి కూడా ఇబ్బందులు ఫేస్ చేశాను. నా రెమ్యునరేషన్ కూడా ఇచ్చేశాను. సినీ ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ వస్తాయి. కానీ నేను ఒకటి మాత్రమే ఆలోచించాను. నన్ను ప్రేమించేవారున్నారని. డబ్బుకెప్పుడూ నేను ప్రాధాన్యత ఇవ్వలేదు. బంధాలకు, మనిషి బంధానికి ప్రాధాన్యత ఇచ్చాను. చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను. సినిమా అనేది అభిమానులను అలరించాలి. ఒక ఫ్లాప్ తర్వాత ఇండస్ట్రీపై గ్రిప్ రాలేదు. అయితే ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే నాకోసం నిలబడ్డాడు. సాధారణంగా సక్సెస్‌ల్లో వెతుక్కుంటూ వస్తారు. అయితే ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చిన నా ఆత్మబంధువు త్రివిక్రమ్‌గారు. జల్సా సినిమా నాతో చేశాడు.
అందుకే రీమేక్ సినిమాలు చేశాను
పార్టీని నడపటానికి, భార్యను, పిల్లలను పోషించాలంటే సినిమాలు చేయాలి.. అందుకనే రీమేక్ సినిమాలు చేశాను. సొంత సినిమాలు చేయవచ్చు. కానీ వేరే దారి లేక రీమేక్స్ చేశాను. సమాజ బాధ్యత పిచ్చి, దేశం అంటే పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా చేయాలని కోరుకుంటే అది ఎ.ఎం.రత్నంగారి ద్వారా ‘హరిహర వీరమల్లు’గా వస్తుంది. నాతో బలమైన సినిమా చేద్దామని రత్నంగారు కోరుకున్నారు. క్రిష్‌గారి వల్ల ఈ సినిమా వచ్చింది. ఆయన వ్యక్తిగత, ప్రొఫెషనల్స్ రీజన్స్ వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ సినిమాను చేసే సమయంలో నేను నిరుత్సాహపడినప్పుడల్లా కీరవాణిగారు నాలో ధైర్యాన్ని నింపారు. ఈ సినిమా ఈరోజు ఇంత బలంగా ఉందంటే కారణం కీరవాణిగారు మాత్రమే.
నిధి అగర్వాల్‌ను చూసి సిగ్గుపడి మీడియా ముందుకు వచ్చాను
ఖుషి సమయం నుంచి జ్యోతికృష్ణ సినిమాను చాలా బాగా హ్యండిల్ చేశాడు. తండ్రికున్న విజన్‌కి తను సారథ్యం వహించాడు. నేను ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే టైమ్ ఇస్తూ వచ్చాను. నా ఆఫీస్ నుంచి కూతవేట దూరంలో ఉన్న భూమిని సెట్స్‌గా మార్చి సినిమాను పూర్తి చేశాం. నిర్మాత దయాకర్ రావుగారికి, తోట తరణిగారికి థాంక్స్. ఈ సినిమాను నెల రోజుల నుంచి జనంలో ఉండేలా చూసుకుంది మాత్రం నిధి అగర్వాల్. తనను చూసి నేను సిగ్గు తెచ్చుకుని నేను కూడా మీడియా ఇంటరాక్షన్ చేశాను. బాబీ డియోల్‌గారు ఇందులో ఔరంగజేబు పాత్రలో అద్భుతంగా నటించారు. ‘హరిహర వీరమల్లు’ నాకెంతో ఇష్టమైన సబ్జెక్ట్. మనం చదువుకున్న రోజుల్లో మొఘలుల గొప్పతనం చెప్పారు. కానీ వాళ్లు పెట్టిన ఇబ్బందులు గురించి చెప్పలేదు. ఔరంగజేబు కాలంలో హిందువుగా జీవించాలంటే ట్యాక్స్ కట్టాలి. అలాంటి సమయంలో చత్రపతి శివాజీ మన గుండెల్లో ధైర్యాన్ని నింపాడు. అలాంటి గొప్ప వ్యక్తి శివాజీ. అలాంటి చక్రవర్తిని ఎదిరించే ఊహాత్మక పాత్రే హరిహర వీరమల్లు. మన కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లింది.
నేను కలెక్షన్స్ గురించి మాట్లాడను
‘హరిహర వీరమల్లు’ మేకింగ్ ప్రాసెస్‌లో ఎంతో నలిగాం. ఈ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడను. ఈ మూవీ గురించి బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చాను. చిన్నప్పుడు నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌ను మళ్లీ ఈ సినిమా కోసం ఒకట్రెండు నెలలు మళ్లీ ప్రాక్టీస్ చేశాను. ఈ మూవీ క్లైమాక్స్ కోసం 18 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్‌ను నేనే కంపోజ్ చేశాను. అభిమానులే నా బలం. మనల్ని ఎవడ్రా ఆపేది అంటే అభిమానులే ముందుకు వచ్చి నిలబడ్డారు’’ అన్నారు.


