Prabhas Kalki 2898 AD – Indian Film Festival of Melbourne: టాలీవుడ్ సినిమా పరిశ్రమ అంతర్జాతీయ వేదికలపై తనదైన ముద్ర వేస్తోంది. ఈ కోవలోనే, ప్రముఖ నటుడు ప్రభాస్ (Prabhas), దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) అవార్డ్స్ 2025లో తన సత్తా చాటింది. ఈ చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఇది తెలుగు సినిమాకు గర్వకారణం. కల్కి 2898 ADతో పాటు, ఈ విభాగంలో హోమ్‌బౌండ్, ఎల్2 ఎంపురాన్, మహారాజ, స్త్రీ-2, సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ వంటి చిత్రాలు పోటీలో ఉన్నాయి.
Also Read- K-RAMP: కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ గ్లింప్స్.. ఇదెక్కడి లెక్క.. బూతులు మాట్లాడితే హిట్ వస్తుందా!
మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ కేవలం ఉత్తమ చిత్రం విభాగంలోనే కాకుండా, ఇతర విభాగాల్లోనూ పలు భారతీయ చిత్రాలను, నటీనటులకు ఇవ్వాల్సిన గుర్తింపునిచ్చింది. ఉత్తమ నటుడు విభాగంలో మోహన్‌లాల్ (ఎల్2 ఎంపురాన్), అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్), ఆదర్శ్ గౌరవ్ (సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్), ఇషాన్ ఖట్టర్ (హోమ్‌బౌండ్), విశాల్ జెత్వా (హోమ్‌బౌండ్), జునైద్ ఖాన్ (మహారాజ్) వంటి ప్రముఖులు పోటీ పడుతున్నారు. అలాగే, ఉత్తమ నటి విభాగంలో అంజలీ శివరామన్ (బ్యాడ్‌గర్ల్), భనితా దాస్ (విలేజ్ రాక్‌స్టార్స్ 2), కరీనా కపూర్ (ది బకింగహామ్ మర్డర్స్), శ్రద్దా కపూర్ (స్త్రీ – 2), తిలోత్తమ షోమ్ (షాడో బాక్స్) నామినేట్ అయ్యారు. ఉత్తమ వెబ్ సిరీస్, ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్), ఉత్తమ నటి (వెబ్ సిరీస్) విభాగాల్లో కూడా నామినేషన్లు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానం ఆగస్టు 14న జరగనుంది, అలాగే ఈ వేడుకలు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆగస్టు 14 నుండి 24 వరకు జరుగుతాయి.
గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సునామీ సృష్టించిన కల్కి 2898 AD, తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సీక్వెల్ కూడా రూపొందనున్న సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, సలార్, దేవర, పుష్ప వంటి చిత్రాల విజయాలు తెలుగు సినిమాల గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడేలా చేశాయి. మన తెలుగు హీరోలు, దర్శక నిర్మాతలు వెండితెరపై అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్, సినిమాటిక్ టెక్నాలజీని చూపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
Also Read- Vijay Deverakonda: విజయ్‌దేవరకొండతో రాజాసాబ్ హీరోయిన్ మూవీ.. ఓపెనింగ్‌తోనే ఆగిపోయిన సినిమా?


