Thursday, April 24, 2025
Homeచిత్ర ప్రభPrakash Raj: ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైంది: ప్రకాశ్‌రాజ్

Prakash Raj: ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైంది: ప్రకాశ్‌రాజ్

పహల్గాం ఉగ్రదాడిని సీనీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైందని వాపోయారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని కశ్మీర్‌పై జరిగిన దాడిగా అభివర్ణించారు. కశ్మీరీలు మౌనం వీడాల్సిన సమయమిదని ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

‘‘ఏప్రిల్‌ 22, 2025.. పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు. ప్రశాంతమైన ప్రకృతి ప్రదేశమైన పహల్గాంలో నెత్తురు చిందిన రోజు. ప్రతి కశ్మీరీ గుండె పగిలింది. కూర్రమైన, అర్ధరహితమైన ఈ చర్యను చెప్పటానికి మాటలు కూడా రావడం లేదు. అందుకే బరువైన, బాధతో కూడిన హృదయంతో ఇది రాస్తున్నా. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణం కాల్చి చంపారు. మన పైన్ అడవులు, అందమైన సెలయేళ్లు, ప్రశాంత వాతావరణం ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితిని ఎదుర్కొన్నారు. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్‌పై దాడి. శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం. మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా దుష్ట ప్రయోజనాల కోసం చేసిన దారుణచర్య. కశ్మీరీలంతా దుఃఖంలో ఉన్నాం. ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది.

ఇలాంటివి జరిగిన ప్రతిసారీ, మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు, చేయని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో మరోసారి నిస్సందేహంగా చెబుతున్నా. దీనిని అస్సలు క్షమించం.. ఇది నిజంగా భయంకరమైన చర్య. అంతకుమించి పిరికిపంద చర్య. ఇలాంటి సమయంలో కశ్మీరులు మౌనంగా ఉండకూడదు. మేము ఎంతో దుఃఖంతో ఉన్నాం. మన ఇంటిలో జరిగిన ఈ క్రూర చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు” అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News