Prasanth Varma : టాలీవుడ్ యువ దర్శకులలో సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన మొదటి సినిమా ‘అ’ తర్వాత కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో మెప్పించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ సినిమాతో రాబోతున్నాడు. జాంబి రెడ్డి సినిమా తర్వాత యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తోన్న సినిమా ‘హనుమాన్’.
ఇటీవలే హనుమాన్ టీజర్ రిలీజవ్వగా ఈ టీజర్ మంచి ప్రశంసలు అందుకుంది. టీజర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచానాలు పెరిగాయి. టీజర్ బాగుండటంతో ఆదిపురుష్ కంటే చాలా బాగుందని బాగా ప్రమోట్ చేశారు నెటిజన్లు. హనుమాన్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో రామాయణాన్ని పురాణంగా వ్యక్తీకరిస్తూ మాట్లాడాడు ప్రశాంత్.
తాజాగా ఈ విషయంలో ప్రశాంత్ వర్మ క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ”నా స్పీచ్ లో రామాయణాన్ని పురాణం అన్నందుకు క్షమించండి. అది మన చరిత్ర. జై శ్రీరామ్” అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మన రామాయణ, మహాభారతాలని చరిత్ర అంటూ మన చరిత్రని చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నావంటూ ప్రశాంత్ వర్మని పొగిడేస్తున్నారు.