HHVM: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రకటించిన ఐదేళ్ల తర్వాత, ఈ భారీ చిత్రం జులై 24న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మం కోసం యుద్ధం చేసే వీరుడి పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల వాయిదాలపై మీడియాలో వచ్చిన వార్తలు తననెంతో బాధించాయని, కోపం తెప్పించాయని చిత్ర నిర్మాత ఏఎం రత్నం తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కొందరు తమ అనకూల మీడియాలో ఈ సినిమా దాదాపు 14 సార్లు వాయిదా పడిందని ప్రచారం చేశారని, అలాంటి వార్తలు చూసి తాను చాలా ఫీలయ్యానని రత్నం స్పష్టం చేశారు. అయితే, వాస్తవానికి ఈ చిత్రం కేవలం మూడుసార్లు మాత్రమే పోస్ట్‌పోన్ అయింది అని ఆయన క్లారిటీ ఇచ్చారు. మార్చి 28, మే 9, జూన్ 12 తేదీలకు వాయిదా పడిందని, జూన్ 12న రిలీజ్ చేయలేకపోయినప్పుడు తాను కూడా చాలా బాధపడ్డానని అన్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా ఒక్కసారి కూడా వాయిదా పడలేదని, తాను సినిమా సిద్ధమైన తర్వాతే రిలీజ్ డేట్ చెబుతానని ఆయన తెలిపారు. గ్రాఫిక్స్ కారణంగా హరిహర వీరమల్లు వాయిదా పడిందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read – Mahesh Babu: SSMB29 నెక్ట్స్ షెడ్యూల్.. డైలామాలో రాజమౌళి
హరిహర వీరమల్లు సినిమాకు బిజినెస్ కాలేదని (Hari Hara Veera Mallu Business), అందుకే వాయిదా వేశారంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. తాను ఎప్పుడూ సినిమా బడ్జెట్‌ను చెప్పనని, ఈ సినిమాకు కూడా చెప్పనని తెలిపారు. ‘హరి హర వీరమల్లు’ ఒక పెద్ద చిత్రం అని, ఎన్నో కష్టాలు దాటి విడుదలకు సిద్ధమైందని నిర్మాత అన్నారు. సినిమా ప్రారంభించిన తర్వాత కొవిడ్ మహమ్మారి అడ్డుపడిందని, ఆ తర్వాత ఎలక్షన్స్ కారణంగా కొన్ని రోజులు షూటింగ్ ఆపేశామని వివరించారు. ఇన్ని సవాళ్లను దాటుకొని ఈ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ట్రైలర్ చూశాక అందరూ ఆశ్చర్యపోయారని, కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని, పవన్ కల్యాణ్ స్థాయిని మరింత పెంచుతుందని ఏఎం రత్నం ధీమాగా చెప్పారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలుగా ఫిక్స్ అయ్యిందని ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజీ వైరల్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read – Sreemukhi: స్టైలిష్ లుక్‌లో యాంకర్ శ్రీముఖి.. ఫొటోలు వైరల్


