Tollywood Film Chamber Issue: తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల పెంపు డిమాండ్‌తో కార్మికులు సోమవారం నుంచి సమ్మెకు దిగడంతో (ఆగస్టు 4, 2025) షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని నిర్మాణ సంస్థలు అంగీకరించకపోవడంతో ఈ వివాదం మరింత తారాస్థాయికి చేరింది. పరిస్థితిని చక్కదిద్దడానికి ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, మైత్రీ మూవీస్ రవి, సూర్యదేవర నాగవంశీ వంటి ప్రముఖ నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొని కార్మికుల డిమాండ్లను చర్చించి, పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం రోజున ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతోనే కార్మికులు ఈ సమ్మె నిర్ణయం తీసుకున్నారు.
ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, కోశాధికారి టీవీ అలెగ్జాండర్ దీనికి సంబంధించి లెటర్ కూడా విడుదల చేశారు. అందులో 30% వేతన పెంపునకు అంగీకరిస్తున్నట్లు లిఖితపూర్వకంగా లేఖ అందిన తర్వాతే షూటింగ్‌లకు హాజరవుతామని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు తెలుగులో ఎక్కడ షూటింగ్ జరిగినా వర్తిస్తాయని కూడా పేర్కొన్నారు.
ఈ వివాదం పరిష్కారం కోసం, ఈ రోజు సాయంత్రం సినీ పరిశ్రమకు చెందిన మూడు వర్గాలు కార్మిక కమిషన్‌ను కలవనున్నాయి. ఈ చర్చలు ఏ విధంగా ముగుస్తాయోనని చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ బంద్ వల్ల ఇప్పటికే షూటింగ్‌లో ఉన్న సినిమాల పైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ఉదాహరణకు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో, ఫెడరేషన్ ప్రతినిధులు ఆయన్ని కలిసి తమ సమస్యలను వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. OG, అఖండ 2 వంటి పెద్ద సినిమాలపైనా ఈ సమ్మె ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. చిన్న సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే చిన్న నిర్మాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికే వారిని థియేటర్స్ సమస్య వేధిస్తోంది. సినిమాలను నిర్మించి సరైన రిలీజ్ డేట్, థియేటర్స్ లేకుండా నష్టపోయినవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికుల జీతం పెరిగితే చిన్న నిర్మాతల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందనటంలో సందేహం లేదు.
ఈ బంద్‌తో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ సమస్య త్వరగా పరిష్కారమైతేనే, షూటింగ్‌లు తిరిగి ప్రారంభమవుతాయని కార్మికులు హెచ్చరిస్తున్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న ఈ సంక్షోభం త్వరగా ముగిసి, మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని అంతా ఆశిస్తున్నారు.
Also Read – Mrunal Thakur: డేంజర్ జోన్ లో హాట్ బ్యూటీ..?


