ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule). భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. కేవలం 10 రోజుల్లోనే రూ.1292కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది.
అలాగే హిందీ మార్కెట్‌లోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసినట్లు తెలిపింది. పది రోజుల్లోనే హిందీ మార్కెట్‌లో ఈ సినిమా రూ.507.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు పేర్కొంది. హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన చిత్రంగా రికార్డు సృష్టించిందని వెల్లడించింది.
ఇదిలా ఉంటే కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. అతి తక్కువ సమయంలో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సినిమాగా చరిత్ర నెలకొల్పింది.