Ravi Rathod: చిన్నతనం నుంచే వెండితెరపై అలరించిన నటులు చాలామంది. వారిలో ‘విక్రమార్కుడు’ సినిమాతో బాగా గుర్తుండిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ (Ravi Rathod) ఒకరు. దాదాపు పాతికకు పైగా సినిమాల్లో బాలనటుడిగా నటించిన రవి రాథోడ్‌ను హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) చిన్న వయసులోనే దత్తత తీసుకుని మంచి స్కూల్‌లో చేర్పించారు. అయితే చదువు పట్ల ఆసక్తి లేని రాథోడ్ సెలవులకు ఊరెళ్లి, అక్కడే ఉండిపోయి, మళ్లీ స్కూలుకు వెళ్లనేలేదు. ఆ తర్వాత చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు.
దురదృష్టవశాత్తు, రవి రాథోడ్ కాలక్రమేణా మద్యానికి బానిసైపోయాడు. ఒకానొక దశలో ‘మందు లేకపోతే బతకలేను’ అన్నంత దుస్థితికి చేరుకున్నట్లు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చిన్నప్పుడు తన చదువు కోసం ఎంతో తాపత్రయపడిన లారెన్స్‌ను తిరిగి కలవడానికి భయపడ్డాడు. స్కూలు నుంచి ఎందుకు పారిపోయావని తిడతారేమో, కొడతారేమోనని వెనకడుగు వేసినట్లు తెలిపాడు.
ఈ విషయం ఎలాగోలా లారెన్స్‌కు తెలిసింది. ‘నిన్ను తిట్టను, కొట్టను.. ఒక్కసారి వచ్చి కలువురా’ అని లారెన్స్ ఎక్స్ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ధైర్యం తెచ్చుకున్న రవి రాథోడ్ ఎన్నో ఏళ్ల తర్వాత చెన్నైలోని లారెన్స్ ముందుకు వెళ్లాడు. రవి పరిస్థితి చూసి చలించిపోయిన లారెన్స్, అతడికి తక్షణ సాయంగా రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు.
Also Read – Vivo X200 FE: వివో X200 FE విడుదల..మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC, 6,500mAh బ్యాటరీ..
లారెన్స్‌తో జరిగిన సంభాషణ గురించి రవి రాథోడ్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యలో తెలియజేస్తూ ‘‘మాస్టర్ నన్ను చూడగానే ఒక మాటన్నారు. ‘తాగేవాళ్లకు నేను సపోర్ట్ చేయను. ఏదో నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసని సపోర్ట్ చేస్తున్నానంతే!’ అన్నారు’’ అని వివరించాడు. అంతేకాదు, రవికి ఆల్కహాల్ అడిక్షన్ తగ్గించడానికి అన్ని టెస్టులు చేయించి, మెడిసిన్స్ కూడా ఇప్పించారు. వైద్యులు, మందులు వాడినప్పుడు మద్యం తాగితే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించినట్లు రవి చెప్పాడు. లారెన్స్ ఇచ్చిన డబ్బుతో రవి ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నాడు.
‘చెన్నై నుంచి వచ్చాక నేను తాగుడు మానేశాను’ అని రవి రాథోడ్ స్పష్టం చేశాడు. అయితే, అతని కాలి నొప్పి ఇంకా తగ్గలేదని, ఏదైనా ఆధారం ఉంటేనే నడవగలుగుతున్నానని చెప్పాడు. రవి వెంట చెన్నై వెళ్లిన అతని స్నేహితుడు మాట్లాడుతూ, రవికి టెస్టులు చేయగా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, దానివల్లే కాళ్లపై ప్రభావం పడి సరిగా నడవలేకపోతున్నాడని తెలిపాడు. ముఖ్యంగా, రవి రాథోడ్ జీవితంలో మళ్లీ మద్యం జోలికి వెళ్లనని లారెన్స్‌కు మాట ఇచ్చాడని స్నేహితుడు వెల్లడించాడు. రవి రాథోడ్ ఈ మాటపై నిలబడి, లారెన్స్ ఇచ్చిన మద్దతుతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడేమో చూడాలి.
Also Read – iQOO Z10R: ఐక్యూ నుంచి కొత్త ఫోన్..లాంఛ్‌కు ముందే స్పెక్స్ లీక్..


