Coolie Collections : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కూలీ’. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబడుతోంది. ‘కూలీ’ చిత్రంలో రజనీకాంత్ దేవా అనే పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఓవర్‌సీస్‌లో సినిమా సత్తా చాటుతోంది. మరే తమిళ సినిమాకు లేని విధంగా ఈ సినిమా ప్రీమియర్స్ కలెక్షన్స్‌ను సాధించింది. నార్త్ అమెరికాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ‘కూలీ’ చిత్రానికి సంబంధించిన నార్త్ అమెరికా హక్కులను సొంతం చేసుకుంది. ప్రీ బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది రోజులకే.. విడుదలకు రెండు రోజుల ముందే ఈ చిత్రం రెండు మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరటం విశేషం. ప్రీమియర్స్‌లో ఈ స్థాయిలో వసూళ్లను సాధించిన మొదటి తమిళ సినిమాగా ‘కూలీ’ రికార్డు నెలకొల్పింది.
‘కూలీ’ ప్రీమియర్స్ కలెక్షన్స్ రజనీకాంత్ గత రికార్డులను కూడా అధిగమించటమే కాదు.. ఇండియన్ సినిమాలోనే టాప్ త్రీ ప్లేస్‌ను దక్కించుకోవటం విశేషం. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రకటించింది. 2016లో రజనీకాంత్ నటించిన కబాలి (Kabali) నార్త్ అమెరికాలో విడుదల కాకముందే $60 వేల డాలర్లు వసూలు చేసిన మొదటి తమిళ సినిమాగా అప్పట్లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత కూలీ ఆ రికార్డును బ్రేక్ చేసింది, తలైవా రికార్డును ఆయన సినిమానే బ్రేక్ చేయడం విశేషం.
కూలీ నార్త్ అమెరికా ప్రీమియర్స్ లో $ 3.04 మిలియన్ మార్క్ చేరుకుందని మేకర్స్ ప్రకటించారు. బాక్సాఫీస్ వద్ద ‘కూలీ’ ప్రీమియర్స్ ద్వారా మూడు మిలియన్ డాలర్స్‌కు పైగా వసూలు చేసి అదరగొట్టింది. భారతీయ చిత్రాల్లో నార్త్ అమెరికా ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది.
నార్త్ అమెరికా ప్రీమియర్స్ టాప్ 5 ఇండియన్ సినిమాలు:
1. కల్కి 2898AD (తెలుగు) – $3.9M
2. ఆర్ ఆర్ ఆర్ (తెలుగు) – $3.46M
3. కూలీ (తమిళం) – $2.9M+
4. బాహుబలి – 2 (తెలుగు) – $3M
5. సలార్ పార్ట్ – 1 (తెలుగు) – $2.6M
కూలీ చిత్రంలో రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే అతిథి పాత్రల్లో అలరించారు. కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా, అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. మొత్తంగా కూలీ (తమిళం) $3.04 మిలియన్స్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందుతూ బాక్సాఫీస్ వద్ద విజయం వైపు దూసుకుపోతోంది.


