నటీనటులు: రజినీకాంత్, నాగార్జున అక్కినేని, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతీహాసన్, సత్యరాజ్, రెబ్బా మోనికా తదితరులు
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
నిర్మాత: కళానిధి మారన్
సంగీతం: అనిరుద్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
Coolie Review: సూపర్‌స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన చిత్రం ‘కూలీ’. నాగార్జున అక్కినేని ఇందులో విలన్‌గా నటించారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. అలాగే ప్రీ బుకింగ్స్‌లోనూ కూలీ హవా చూపించింది. మరి సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? రజినీకాంత్ ఈ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతారా? లోకేష్ కనకరాజ్ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చూపించారా? అనే విషయం తెలియాలంటే ముందుగా కథలోకి వెళదాం…
కథ:
Coolie Review: దేవా(రజినీకాంత్), రాజశేఖర్ (సత్యరాజ్) ప్రాణ స్నేహితులు. కొన్ని కారణాలతో విడిపోయిన ఇద్దరూ ముప్పై ఏళ్లుగా కలుసుకోరు. దేవా చెన్నైలో ఓ మాన్షన్ నడుపుతుంటే, వైజాగ్‌లో రాజశేఖర్ కుమార్తెల ప్రీతి(శ్రుతి హాసన్) తో కలిసి ఉంటారు. ఓరోజు రాజశేఖర్ గుండె పోటుతో చనిపోయాడనే విషయం దేవాకు తెలుస్తుంది. దాంతో అతను వైజాగ్ వెళతాడు. అయితే దేవాను ప్రీతి అవమానిస్తుంది. అదే సమయంలో రాజశేఖర్‌ది సహజ మరణం కాదనే నిజం తెలుసుకున్న దేవా.. అదే విషయాన్ని ప్రీతి అతని చెల్లెళ్లకు చెప్పి వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో హార్బర్‌ను కంట్రోల్లో పెట్టుకున్న సైమన్ (నాగార్జున అక్కినేని) దగ్గర దేవా పని చేయాల్సి వస్తుంది. సైమన్‌కు రైట్ హ్యాండ్ లాంటి దయాల్ (సౌబిన్ షాహిర్) అసలు కథేంటి? దేవా, సైమన్ మధ్య గొడవ ఎక్కడ ప్రారంభమవుతుంది? ఇంతకీ దేవా ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
Coolie Review: దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ తనదైన మార్క్ స్టైల్, పవర్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. యాక్షన్, ఎమోషన్, స్టైల్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను మేళవించి ప్రేక్షకులని అలరించారు. కథలో పాత్రకు తగిన వేరియేషన్స్ చూపిస్తూ మెప్పించారు సూపర్‌స్టార్. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్, ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ లుక్స్ ఇలా అన్నింటిలోను రజినీ మార్క్ స్పష్టంగా కనిపించింది. విలన్ సైమన్ పాత్రలో నటించిన నాగార్జున పాత్రకు తన నటనతో జీవం పోశారు. ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అతిథి పాత్రలలో ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు తమకు తగ్గ స్థాయిలో ఆకట్టుకున్నారు. సౌబిన్ షాహిర్ విలనిజం సింప్లీ సూపర్బ్, రచితా రామ్ అతనితో పోటీ పడి విలనిజాన్ని ఎలివేట్ చేసింది. ఇక సత్యరాజ్ కూతురిగా నటించిన శ్రుతీ హాసన్ తన పాత్రకు న్యాయం చేసింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో దుమ్ము రేపింది. సత్యరాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సాంకేతిక విషయాలకు వస్తే.. లోకేష్ కనగరాజ్ కథ, కథనాలు, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఆయన సృష్టించిన క్యారెక్టర్లు కూడా కథానుగుణంగా బాగానే ఉన్నాయి. అయితే లోకేష్ కనకరాజ్ హీరో, విలన్ సహా ఇతర పాత్రల ఎలివేషన్స్‌పై పెట్టిన ఫోకస్ కథ, స్క్రీన్‌పై పెట్టి ఉండుంటే బావుండేది. సినిమాలో ఎమోషనల్ కనెక్టింగ్ పాయింట్ ఎక్కడా కనిపించదు. స్లో నెరేషన్‌లా అనిపిస్తాయి. సెకండాఫ్‌ను మరీ సాగదీసినట్లుగా అనిపించింది. అనిరుద్ తన సంగీతంతోనే కాదు.. బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనూ అలరించాడు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ బావుంది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరగా.. ‘కూలీ’.. ఫ్యాన్స్ కోసం
రేటింగ్ : 2.25/5


