Rajinikanth Comments On Nagarjuna: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కూలీ’. ఆగస్టు 14వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవల విడుదలైన కూలీ ట్రైలర్‌కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో పాటు శృతిహాసన్, నాగార్జున, సత్యరాజ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. రజినీకాంత్ ఈవెంట్‌కు హాజరు కాలేదు కానీ.. స్పెషల్ వీడియోను షేర్ చేశారు.
వీడియోలో రజినీకాంత్ మాట్లాడుతూ.. లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ఆయన కొనియాడారు. తెలుగులో రాజమౌళి ఎలాగో, తమిళంలో లోకేష్ అలాగే అంటూ లోకేష్‌పై ప్రశంసలు కురిపించారు. నాగార్జున చేసిన విలన్ పాత్ర గురించి కూడా రజినీ స్పందించారు. కూలీ సినిమా కథ చెప్పేటప్పుడు విలన్ పాత్ర విని తాను చాలా ఎక్సైట్ అయ్యానని రజినీకాంత్ తెలిపారు. సైమన్ అనే ఈ విలన్ పాత్ర చాలా అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజుల తర్వాత ఈ పాత్రలో తెలుగు స్టార్ హీరో నాగార్జున నటిస్తున్నారని చెప్పగానే తాను ఆశ్చర్యపోయానని రజినీకాంత్ వెల్లడించారు. నాగార్జున డబ్బు కోసం ఇలాంటి పాత్రలలో నటించరని తనకు తెలుసని, గత 30 సంవత్సరాలుగా తాను హీరోగా మంచి మంచి పాత్రలలో నటించి బోర్ కొట్టడం వల్లే ఇలా విలన్ గా కనిపించబోతున్నానని నాగార్జున చెప్పినట్టు రజినీకాంత్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read – CM Revanth: అందుకు రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్
నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నారో, ఇప్పటికీ అలాగే, మన్మధుడిగానే ఉన్నారని రజినీకాంత్ ప్రశంసించారు. తాను మాత్రం ముసలోడిని అయిపోయానని సరదాగా వ్యాఖ్యానించారు. నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటా అని అడిగితే, ఎక్సర్సైజెస్, స్విమ్మింగ్ చేస్తానని, కాస్త డైట్ ఫాలో అవుతానని మాత్రమే చెప్పారని, అలాగే నాన్నగారి జీన్స్ కూడా వచ్చాయని చెప్పినట్టు రజిని వెల్లడించారు. దాదాపు 15 రోజుల పాటు నాగార్జునతో కలిసి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నానని, ఆయనతో పని చేయడం గురించి ఆసక్తికరమైన విషయాలను రజినీకాంత్ పంచుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు.
ఈ వీడియోలో రజినీకాంత్ సత్యరాజు, శృతిహాసన్, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి ఇతర నటీనటుల గురించి కూడా మాట్లాడారు. కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అదే రోజున ఎన్టీఆర్ నటించిన వార్ 2 కూడా విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది.
Also Read – Malavika Birth Day Speical: రాజా సాబ్ నుంచి మాళవిక పోస్టర్ రిలీజ్.. దివి నుంచి దిగివచ్చిన దేవకన్యాలా!


