Nithilan Saminathan: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వేగంగా దూసుకుపోతున్నారు. గతేడాది అక్టోబర్‌లో ‘వేట్టయాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయనకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. అయితే వచ్చే నెలలో ‘కూలీ’తో పలకరించనున్నారు. మరో వైపు ఆయన తర్వాత చిత్రం ‘జైలర్-2’ చిత్రీకరణ దశలో ఉంది, ఇది రానున్న వేసవికి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలతో పాటు రజినీకాంత్ తన నెక్ట్స్ సినిమా గురించి ఆసక్తికరమైన కబురు వినిపిస్తోంది. ఈసారి ఆయన మరో యంగ్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ దర్శకుడెవరో కాదు.. నిథిలన్ స్వామినాథన్.
గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘మహారాజా’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు నిథిలన్ స్వామినాథన్. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, కమర్షియల్‌గానూ గొప్ప విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ సౌత్‌తో పాటు నార్త్ ఆడియెన్స్‌ను మెప్పించిన ‘మహారాజా’ సినిమాను చైనాలో కూడా విడుదల చేయగా, అక్కడ కూడా మంచి వసూళ్లు సాధించడం విశేషం. ప్రస్తుతం నిథిలన్ తన తర్వాత ప్రాజెక్ట్‌గా ‘మహారాజా-2’ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు, ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
Also Read – HHVM: హరి హర వీరమల్లు.. పవన్ కళ్యాణ్ పాత్ర వెనుక స్ఫూర్తి వాళ్లేనా!
లేటెస్ట్ సమాచారం మేరకు నిథిలన్ ‘మహారాజా-2’ను పూర్తి చేసిన తర్వాత, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి పనిచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిథిలన్ చెప్పిన ఒక లైన్ రజినీకాంత్‌కు నచ్చడంతో, సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రజినీ, నిథిలన్ ఇద్దరూ తమ తమ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న తర్వాత, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ కొత్త సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది. ‘జై భీమ్’ లాంటి విభిన్నమైన సినిమా తీసిన జ్ఞానవేల్, రజినీతో చేసిన ‘వేట్టయాన్’తో ప్రేక్షకులను నిరాశపరిచారు. ఈ నేపథ్యంలో, ‘మహారాజా’తో తన ప్రతిభను నిరూపించుకున్న నిథిలన్, రజినీకాంత్‌తో కలిసి ఒక పెద్ద కమర్షియల్ హిట్ కొడతాడేమో వేచి చూడాలి.
ఆగస్ట్ 14న రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన కూలీ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్, శ్రుతీ హాసన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక జైలర్ 2 విషయానికి వస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్‌తో పాటు టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ కూడా నటిస్తున్నారు.
Also Read – Ashu Reddy: బీచ్ ఒడ్డున అందాలు ఆరబోసిన బిగ్ బాస్ బ్యూటీ


