ఆర్ఆర్ఆర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, “గేమ్ ఛేంజర్” తో ఊహించని నిరాశ ఎదుర్కొన్నారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, అంచనాలను అందుకోలేకపోయి.. రూ.100 కోట్ల షేర్ కూడా సాధించలేకపోయింది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అభిమానులు కూడా ఈ ఫలితంతో నిరాశ చెందినా, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌పై ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్, బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు సిద్ధమవుతున్నారు. పెద్ది అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత, అభిమానుల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమిటంటే, ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ-సిరీస్ ఈ సినిమా ఆడియో హక్కులను రూ.35 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయనడానికి నిదర్శనం.
ఈ చిత్రానికి సంగీతం ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల ట్యూన్లు సిద్ధమయ్యాయని సమాచారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రత్యేకంగా ఆ ప్రాంత మాండలికాన్ని నేర్చుకుంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, నిర్మాత వెంకట సతీష్ కిలారు తన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న ఈ సినిమాలోని “ఫస్ట్ షాట్” విడుదల చేయనున్నారు.