Ram Gopal Varma : సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఈ రోజు. జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవరాత్ ‘సీక్వెల్ నేడు విడుదలైంది. దాదాపు 13 ఏళ్లుగా ‘అవతార్-2’ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ క్యూ కట్టారు. అవతార్ చిత్రం లాగానే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుందని అంతా బావిస్తుండగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవతార్ -2 చూసిన తరువాత దీన్ని సినిమా అని పిలిస్తే నేరం అవుతుందని వర్మ ట్వీట్ చేశాడు.
“ఇప్పుడే అవతార్-2లో స్నానం చేశా. దీన్ని సినిమా అని అంటే నేరమే అవుతుంది. ఎందుకంటే ఈ చిత్రంలోని విజువల్స్ ఎఫెక్ట్స్, యాక్షన్ జీవితకాలం గుర్తుండిపోతుంది. కొద్ది సేపటి క్రితమే ఈ థీమ్ పార్క్‌ను చూశాను. అది నాకు చెడుగా మాత్రం అనిపించలేదు.” అని రామ్‌గోపాల్ వర్మ అన్నాడు.
‘అవతార్’ కోసం దర్శకుడు జేమ్స్ కామెరూన్ సాంకేతికత సాయంతో ‘పండోరా’ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అక్కడ నావీ అనే అటవీ తెగ నివసిస్తుంటుంది. ప్రకృతే ప్రాణంగా జీవించే వారికి.. అభివృద్ధే లక్ష్యంగా ఉన్న మానవులకు మధ్య జరిగే పోరాటమే అవతార్.