The Girlfriend Review: రశ్మికా మందన్న హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా రానున్నదనీ, దాన్ని అల్లు అరవింద్ ప్రెజెంట్ చేస్తున్నారనీ ప్రకటన రాగానే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తింది. ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి కీలక పాత్ర చేసిన ఈ మూవీ ఎలా ఉందంటే…
కథ
సాహిత్యంపై అనురక్తితో హైదరాబాద్‌లోని ఓ పీజీ కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్‌లో జాయిన్ అవుతుంది భూమాదేవి (రశ్మిక). అదే కాలేజీలో ఎంఎస్‌సీ చదివే విక్రమ్ (దీక్షిత్ శెట్టి)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే కొద్ది కాలానికే విక్రమ్ మనస్తత్వం కొంచెం కొంచెంగా అర్థమై ఆందోళన చెందుతుంది భూమా. అతని కారణంగా కన్నతండ్రి సైతం ఆమెను అసహ్యించుకొనే స్థితి వస్తుంది. విక్రమ్ వల్ల తన అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడటంతో భూమా ఏం చేసింది? తన జీవితాన్ని మళ్లీ తన చేతుల్లోకి తీసుకోగలిగిందా, లేదా? అనేది క్లైమాక్స్.
కథనం
‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రశ్మికా మందన్న నటనా సామర్థ్యాన్ని ఉన్నత స్థాయిలో ఆవిష్కరించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒక మంచి సినిమాకి అదొక్కటే సరిపోదు. ప్రధాన పాత్రల తీరుతెన్నులు, ఆ పాత్రల మధ్య సన్నివేశాలు, కథ నడిచే తీరు ప్రభావవంతంగా, ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉండాలి. ఈ విషయంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ఫెయిల్ అయ్యింది. భూమా, విక్రమ్ పాత్రల్లో లోపాలు స్పష్టంగా అవుపిస్తాయి. అసలు వాళ్లు ఈ కాలపు మనుషులా, లేక 1980, 1990 కాలం నాటివాళ్లా అనే సందేహం వస్తుంది. అమాయకత్వం, అపరిపక్వత ఆ రెండు పాత్రల్లోనూ మనకి కనిపిస్తాయి. కాకపోతే విక్రమ్ పాత్రలో అదనంగా పెళ్లి చేసుకొనే అమ్మాయి ఉద్యోగం లేకుండా, సొంత ఐడెంటిటీ లేకుండా తన అమ్మలాగా ఇంట్లో ఉండి తనకు అన్నీ సమకూర్చిపెట్టే ఒక బానిస లాగా ఉండాలనుకొనే మనస్తత్వం కనిపిస్తుంది.
భూమా వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో ఆవిష్కరించడంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తడబాటుకు గురయ్యాడు. ఒక ఘటనలో తనకు సపోర్టుగా వచ్చి, ఆ తర్వాత పోలీసుల చేతుల్లో దారుణంగా దెబ్బలుతిన్న విక్రమ్ కి ఫస్ట్ ఎయిడ్ చేయాలని అతని స్నేహితుల కంటే కూడా ముందుగా స్పందించే చైతన్యం కలిగిన అమ్మాయిగా కనిపించిన భూమా, ఆ తర్వాత అతనితో ప్రేమలో పడిన తీరు హాస్యాస్పదంగా తోస్తుంది. విక్రమ్ ల్యాప్‌టాప్‌లోని ‘హాయ్ నాన్న’ సినిమా చూడ్డం కోసం అతని రూంకి రాత్రిపూట భూమా వెళ్లే సీను, అక్కడ అతను సెడ్యూస్ చేయడంతో లొంగిపోయే తీరు ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేవు. ఆ రాత్రి తన రూంలో భూమాకీ, తనకూ మధ్య జరిగిన వ్యవహారాన్ని విక్రమ్ కాలేజీలో టాంటాం చేయడం, ఆమె విక్రమ్ ప్రేమ గెలిచి గొప్ప ఘనకార్యం సాధించిందని కాలేజీలో అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి భూమాని ప్రశంసించడం, దాంతో భూమా కూడా అవునా అనుకుంటూ సంతోషపడి, తాను విక్రమ్ ని ప్రేమిస్తున్నానని భావించేసుకొని అతనికి ‘గర్ల్‌ఫ్రెండ్’గా ఉండేందుకు అప్రయత్నంగా ఒప్పేసుకోవడం.. ఏ కాలపు కథ?!
భూమాని విక్రమ్ తన ఇంటికి తీసుకొని వెళ్లినప్పుడు వచ్చే సీన్లు కళ్లు బైర్లు కమ్మిస్తాయి. విక్రమ్ తల్లి ప్రవర్తన ఎంత వింతగా ఉంటుందో! కనీసం తలెత్తి భూమా ముఖం కూడా చూడకుండా కింద నేలచూపులు చూస్తూ ఉంటుంది ఆ తల్లి (రోహిణి). కొంతమంది ఆడవాళ్లు బహుసిగ్గరిగా ఉంటూ పరాయివాళ్లను.. అదీ మగవాళ్లను కన్నెత్తి చూడరనే విషయం మనకు తెలుసు. కానీ ఈ సినిమాలో విక్రమ్ తల్లి వేరే లెవల్. కొడుకు తమ ఇంటికి తెచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌ను చూడ్డానికి కూడా సిగ్గుపడుతుంది. ఆమె ధోరణి గురించి విక్రమ్ ను భూమా ప్రశ్నించినప్పుడు ఆమె అలా ఉండటన్ని గొప్పగా చెబుతాడు తను. అయితే అక్కడే ఒక చక్కని షాట్ తీశాడు రాహుల్. ఆ తల్లి ధోరణి చూసి ఆందోళన చెందిన భూమాకు అక్కడి అద్దంలో తన ప్రతిబింబం కూడా ఆమె తరహా రూపంలోకి మారిపోయి కనిపిస్తుంది కొద్దిసేపు. నిజంగా అది సూపర్బ్ షాట్. కానీ ఏం ప్రయోజనం? అప్పటికీ భూమా తెలివి తెచ్చుకోదు.
ఇక భూమా తండ్రి (రావు రమేశ్) పాత్ర చిత్రణ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తల్లి లేని భూమాను తానే అన్నీ అయ్యిపెంచాననీ, కాబట్టి భూమాపై అన్ని హక్కులూ తనకే ఉన్నాయనీ భావించే టైప్ అతను. భూమాను చూడ్డానికి పొద్దున్నే హైదరాబాద్ వచ్చి, ఆమె రూం తలుపుకొడితే, విక్రమ్ తలుపు తీసేసరికి హతాశుడైపోయిన ఆయన ఒక తండ్రి ఎలా బిహేవ్ చేస్తాడో ఆయనా అలాగే బిహేవ్ చేశాడని సర్దిచెప్పుకున్నా, ఆ తర్వాత ఆయన కూతురితో ప్రవర్తించే తీరుకానీ, విక్రమ్ వల్ల అన్నీ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో భూమా ఫోన్ చేసినప్పుడు ఆమెతో ఆయన మాట్లాడిన దారుణమైన మాటలు కానీ జీర్ణం చేసుకోవడం కష్టం.
అన్ని పాత్రల్లోనూ కొంత నిజాయితీ కలిగిన పాత్ర దుర్గ (అను ఇమ్మాన్యుయేల్). ఆమె కూడా అదే కాలేజీ స్టూడెంట్. ఆమె విక్రమ్ ను ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ కి తనలాంటి టైప్ అమ్మాయి ఎలా సెట్ అవుతుంది! భూమాని విక్రమ్ ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు మొదట ఈర్ష్య చెందిన ఆమె, ఆ తర్వాత భూమా ఇన్నోసెన్స్‌ను ప్రత్యక్షంగా చూసి, ఆమెతో స్నేహం చేస్తుంది. భూమా క్లిష్ట సమయంలో ఆమెకు తోడుగా నిలుస్తుంది.
ఇక విక్రమ్ పాత్రను దర్శకుడు మలిచిన తీరు కూడా ఏమాత్రం ఆకట్టుకోదు. సీనియర్స్ ర్యాగింగ్ సందర్భంగా కాలేజీలో ఆర్. నారాయణమూర్తి పాటకు అతను చేసే బ్రేక్ డాన్స్ చూసి ఆ సీనియర్స్ సహా అందరూ ఫ్లాటైపోయి అతన్ని హీరోని చేసేయడం ఏమిటో బోధపడదు. మొదట ఆవేశపరుడైన మంచి అబ్బాయిగా కనిపించిన అతను, తనను ప్రేమించే దుర్గను దూరంగా పెడుతూ, తన అమ్మ లక్షణాలు కనిపించిన భూమాను ప్రేమించడం, ఆమెపై సర్వాధికారాలు చలాయిస్తూ, ఆమెను తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవడం, ఆమె తండ్రిపై సైతం చేయిచేసుకోడానికి వెనుకాడకపోవడం, ఇంక ఆమెకు మీ అవసరం లేదనీ, భూమా తనదనీ ఆయనను బెదిరించడం, ఆ తర్వాత భూమాతో అతను ప్రవర్తించే తీరూ ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించవు.
నటీనటుల అభినయం
భూమాదేవి పాత్రలో నిస్సందేహంగా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌ను ఇచ్చింది రశ్మిక. ఆ పాత్రలోని అమాయకత్వాన్నీ, మానసిక సంఘర్షణనూ అత్యున్నత స్థాయిలో ప్రదర్శించింది. క్లోజప్ షాట్స్‌లో ఆమె హావభావాలు సూపర్బ్ అనిపిస్తాయి. కానీ ఆమె పాత్రను నేటి కాలపు అమ్మాయిలు సొంతం చేసుకోవడం కష్టం. విక్రమ్ క్యారెక్టర్‌లో దీక్షిత్ శెట్టి బాగా రాణించాడు. పాత్రలోని దుందుడుకు స్వభావాన్నీ, డామినేటించ్ నేచర్‌నీ చక్కగా చూపించాడు. కానీ ఆ పాత్రను ఇష్టపడేవాళ్లుండరు. దుర్గ పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ సహజంగా ఇమిడిపోయింది. ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది. విక్రమ్ తల్లిగా రోహిణిని చూసినప్పుడు ఒక మంచి నటితో ఇలాంటి పాత్ర చేయించారేమిటి అని జాలి కలుగుతుంది. భూమా తండ్రిగా రావు రమేశ్‌ని జనం ఏవగించుకుంటారు. ఆ రకంగా ఆయన సక్సెస్ అయినట్లే. లెక్చరర్‌గా రాహుల్ రవీంద్రన్ అతికినట్లు సరిపోయాడు.
సాంకేతిక అంశాలు
దర్శకుడైన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి రచయిత కూడా. రెండు రకాలుగానూ ఆయన ఫెయిల్ అయ్యాడు. బలహీనమైన స్క్రీన్‌ప్లేకి, ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించని సన్నివేశాలు సినిమాకి తీవ్ర నష్టం కలిగించాయి. పాటలకు హేషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన బాణీలు కానీ, ప్రశాంత్ విహారి బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి ఏమీ ప్రయోజనం కలిపించలేదు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ ఓకే. చోటా కె. ప్రసాద్ చేష్టలుడిగిపోయి ఏదో ఎడిటింగ్ చేశాననిపించాడు.
తెలుగుప్రభ వర్డిక్ట్
రశ్మికా మందన్న నటనా ప్రతిభను చాటిచెప్పే సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. కానీ ఆ గర్ల్‌ఫ్రెండ్‌ను రెండు గంటల పద్దెనిమిది నిమిషాల సేపు భరించడం బహు కష్టం.
రేటింగ్: 2/5
తారాగణం: రశ్మికా మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రాహుల్ రవీంద్రన్, రావు రమేశ్, రోహిణి
మ్యూజిక్: హేషం అబ్దుల్ వహాబ్
బ్యాగ్రౌండ్ స్కోర్: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
రచన-దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
బ్యానర్స్: గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 7 నవంబర్ 2025
– యజ్ఞమూర్తి


