నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) వరుస సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేర్ చేస్తోంది. ఇటీవలే ‘పుష్ప2’ మూవీతో దుమ్మురేపిన ఈ అమ్మడు.. సౌత్ నుంచి నార్త్ వరకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ‘ఛావా’ మూవీతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఈ ఈవెంట్‌లో తాను హైదరాబాద్ నుంచి వచ్చానని తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన తనపై హిందీ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అయితే కర్ణాటకకు చెందిన రష్మిక.. హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పడంపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరు విరాజ్‌పేట గురించి చెప్పకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికే కన్నడలో ఆమె సినిమాలు చేయకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న కన్నడిగులకు.. రష్మిక తాజా వ్యాఖ్యలు మరింత కోపం తెప్పించాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.
కాగా కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటకు చెందిన రష్మిక.. హీరోయిన్‌గా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చారు. తొలిసారి రక్షిత్ శెట్టితో కలిసి ఆమె ‘కిరిక్ పార్టీ’ అనే మూవీలో నటించారు. ఆ తర్వాత తెలుగులో ‘ఛలో’ సినిమాతో పరిచయమయ్యారు. ‘గీతాగోవిందం’ మూవీ సూపర్ హిట్‌తో తెలుగులో స్థిరపడిపోయారు.