Mass Jathara Review: టాలీవుడ్ హీరో రవితేజ పేరు వినగానే ఆయన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌లే గుర్తుకు వస్తాయి. ఆయన చేసిన కమర్షియల్ సినిమాలు.. వాటి హిట్స్‌ను ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. ఆయన కెరీర్‌లో మైల్‌స్టోన్ లాంటి 75వ సినిమా ‘మాస్ జాతర’ కమర్షియల్ ఎలిమెంట్స్‌తోనే ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ధమాకా తర్వాత హిట్ ఎరుగని రవితేజకు ‘మాస్ జాతర’ ఎలాంటి సక్సెస్ ఇచ్చింది. ధమాకా హిట్ పెయిర్ రవితేజ – శ్రీలీల మరో సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకున్నారా? అనే విషయాలు తెలియాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
వరంగల్‌లో పని చేసే రైల్వే ఎస్సై లక్ష్మణ్ భేరి (రవితేజ) చాలా సిన్సియర్ ఆఫీసర్. తన కళ్ల ముందు అన్యాయం జరిగితే చూసి సహించడు. ఓ సందర్భంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుక్కే బుద్ధి చెబుతాడు. ముక్కు సూటిగా వెళ్లే లక్ష్మణ్‌కు తాతయ్యే (రాజేంద్ర ప్రసాద్) పెద్ద దిక్కు. స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న లక్ష్మణ్‌కు అల్లూరి జిల్లాలోని అడవి వరం ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అక్కడకు వెళ్లిన తనకు శివుడు (నవీన్ చంద్ర) చేసే గంజాయి అక్రమ దందా గురించి తెలుస్తుంది. కానీ తన పరిధిలో లేని విషయం కాబట్టి చూసి భరిస్తుంటాడు. అనుకోకుండా శివుడు గంజాయిని గూడ్సు రైలులో తరలించటానికి ప్రయత్నిస్తుంటాడు. విషయం తెలుసుకున్న లక్ష్మణ్ అక్కడకు వెళ్లి రౌడీలను కొట్టి తరిమేస్తాడు. గంజాయిని దాచేస్తాడు. సరుకు ఎక్కడ ఉందో తెలియక శివుడు శివాలెత్తుతాడు? ఇంతకీ సరుకుని లక్ష్మణ్ ఎక్కడ దాస్తాడు? శివుడుని ఎలా అంతం చేస్తాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read- The Paradise: ‘ది ప్యారడైజ్’లో జాయిన్ కానున్న హాలీవుడ్ స్టార్ – నానికి హీరోయిన్ కూడా దొరికేసింది
సమీక్ష:
Mass Jathara Review: రవితేజ వంటి మాస్ హీరో దొరికినప్పుడు ఏ దర్శకుడు అయినా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయటానికే చూస్తాడు. అదే కోవలో భాను భోగవరపు ‘మాస్ జాతర’ వంటి సినిమా చేశాడు. నిజానికి ఇలాంటి పాత్రలు చేయటం రవితేజకు కొత్తేమీ కాదు. కాబట్టి సినిమాలోని రైల్వే పోలీస్ పాత్రలో అలా ఒదిగిపోయాడు. కథానుగుణంగా, పాత్ర పరంగా మాస్ మహారాజా ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో ఇరగదీశాడు. కథ పరంగా చూస్తే కమర్షియల్ మూవీస్‌లో కొత్తగా ఏదో కథలుంటాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. అయితే చెప్పిన పాయింట్‌నే ఎంత కొత్తగా, ఆడియెన్స్‌కు కనెక్టింగ్‌గా చెబుతామనేదే ముఖ్యం. ఇక్కడ మ్యాజిక్ వర్కవుట్ కాకపోతే సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. ‘మాస్ జాతర’ విషయంలో అదే జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుంది.
శ్రీలీల పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గంజాయి అమ్ముకునే దానిపై చూపించారు. దానికొక ఫ్లాష్ బ్యాక్ జోడించి ఆమె పాత్రను ఔదార్యంగా చూపించే ప్రయత్నం చేశారు. గంజాయి అమ్ముకునే విలన్స్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండే హీరో.. హీరోయిన్ విషయంలో మాత్రం పట్టించుకోడు. ఎందుకంటే అది సినిమా అనుకోవాలంతే. విలన్ నవీన్ చంద్ర పాత్రను పవర్ఫుల్‌గా చూపించినప్పటికీ రాను రాను ఆ పాత్ర హీరో ముందు ఎందుకు పనికిరాదని సన్నివేశాలతో తేల్చేశాడు దర్శకుడు. విలన్ పాత్రలో ఢీకొనే ఇగోని చూపించకపోవటం మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక పాత్రో అనే విలన్‌కు స్టార్టింగ్‌లో ఇచ్చిన బిల్డప్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తీరు పేలవంగా ఉంది.
Also Read- Tamannaah: అబద్దాలు చెబితే సహించను – విజయ్ వర్మతో బ్రేకప్‌పై తమన్నా కామెంట్స్
రాజేంద్ర ప్రసాద్ పాత్రతో కామెడీ క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ అది రివర్స్ అయ్యింది. క్లైమాక్స్‌లో హీరోకి సపోర్ట్ చేసే సీన్ మినహా రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎందుకు పెట్టారా? అనే సందేహం కూడా ఒకానొక సందర్భంలో వచ్చేస్తుంది ప్రేక్షకుడికి. సీనియర్ నరేష్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో రవితేజతో తెలంగాణ యాసను పలికించిన తీరు ఇబ్బందికరంగా ఉంది. కొన్ని చోట్లైతే ఆ యాస అస్సలు కనపడనే కనపడదు. దర్శకుడు భాను భోగవరపు సినిమాను ఎక్కడా ఇంట్రెస్టింగ్‌గా మలచలేదు. కనీసం రెండు, మూడు సీన్స్ అయినా బావుందిలే అనుకోనేంతగా పండలేదు. దర్శకుడిగా వచ్చిన ఛాన్స్‌ను భాను మిస్ చేసుకున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.


