అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. తక్కువ సినిమాలతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో అడుగుపెట్టింది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ramcharan) హీరోగా నటిస్తున్న RC16లోనూ నటిస్తోంది. ఇవాళ జాన్వీ 28వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా జాన్వీకపూర్‌కు మూవీ యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో కుడి చేత్తో మేకపిల్లను ఎత్తుకోగా, ఎడమ చేత్తో గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తోంది.
కాగా ఉప్పెన్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.
