Regina Cassandra: సౌత్ హీరోయిన్లకు ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇదివరకు హిందీ సినిమాల్లో దక్షిణాది కథానాయికలు చిన్న చితకా పాత్రల్లో కనిపించేవారు. టైర్ 2 హీరోలతో సినిమా చేయడమే గొప్ప అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్‌గా మారింది. సౌత్ హీరోయిన్లతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.
రష్మిక బాటలో…
సౌత్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్‌లో నంబర్‌వన్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. రష్మిక బాటలోనే పలువురు దక్షిణాది హీరోయిన్లు అడుగులు వేస్తోన్నారు. బాలీవుడ్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోన్నారు. వారిలో రెజీనా కూడా ఉంది. గత కొన్నాళ్లుగా తెలుగు, తమిళ భాషల కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది రెజీనా.
జాట్, కేసరి 2…
ఈ ఏడాది రెజీనా నటించిన హిందీ సినిమాలు జాట్, కేసరి ఛాప్టర్ 2 బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాయి. తాజాగా బాలీవుడ్‌లో మరో మూవీకి రెజీనా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ది వైఫ్స్ పేరుతో ఓ మూవీ చేయబోతున్నది. ఈ సినిమాకు పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, నేషనల్ అవార్డ్ విన్నర్ మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రెజీనాతో పాటు మౌనీరాయ్, సోనాలి కులకర్జి, అర్జున్ బజ్వా, రాహుల్ భట్, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
గౌరవంగా భావిస్తున్నా…
ఇటీవల ది వైఫ్స్ సినిమా లాంఛ్ అయ్యింది. మంగళవారం ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టింది రెజీనా.
కొన్ని కథలు వెండితెరపై చెప్పడం చాలా కష్టమని, అలాంటి వాటిలో ది వైఫ్స్ ఒకటని, మధుర్ భండార్కర్ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది రెజీనా. డైరెక్టర్‌తో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నది.
ప్రపంచానికి తెలియని నిజాలతో…
బాలీవుడ్ స్టార్ హీరోల భార్యల సీక్రెట్స్, వారి స్ట్రగుల్స్, ఎమోషన్స్ చూపిస్తూ ది వైఫ్స్ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు మధుర్ భండార్కర్. స్టార్ హీరోల భార్యల గురించి ప్రపంచానికి తెలియని పలు షాకింగ్ నిజాలను ఈ మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం. నాలుగేళ్ల పాటు రీసెర్చ్ చేసి ది వైఫ్స్ కథను మధుర్ భండార్కర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా కొనసాగుతోన్న టాప్ హీరో భార్యగా రెజీనా కనిపించబోతున్నట్లు సమాచారం.
Also Read- kiara advani: కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఆడబిడ్డ జననం!
తమిళంలో…
ది వైఫ్స్‌తో పాటు బాలీవుడ్‌లో సెక్షన్ 108 సినిమా చేస్తోంది రెజీనా. తమిళంలో నయనతార లీడ్ రోల్‌లో నటిస్తున్న ముక్కుత్తి అమ్మన్ 2లో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.


