Tollywood: టాలీవుడ్‌లో స్ట్రెయిట్ మూవీస్‌కు ధీటుగా విజయాలను సాధించిన డబ్బింగ్ సినిమాలు చాలానే ఉన్నాయి. సూర్య, కార్తీ, యశ్, సౌబీన్ షాహిర్, టోవినో థామస్ ఇలా చాలా మంది పరభాష హీరోలు డబ్బింగ్ మూవీస్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. మంచి సినిమా ఏ భాషలో వచ్చిన ఆదరించడంలో తెలుగు ఆడియెన్స్ ముందుంటారు. అందుకే తమిళం, మలయాళం, కన్నడతో పాటు ఇతర భాషలకు చెందిన హీరోలు తమ సినిమాలను తెలుగులోకి డబ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతోన్నారు. పాన్ ఇండియన్ ట్రెండ్‌తో ఈ డబ్బింగ్ సినిమాల కల్చర్ మరింత పెరిగింది. ఇది వరకు డబ్బింగ్ సినిమాలు తెలుగు నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం తలక్రిందులైంది. కోట్లు పెట్టి కొంటున్న డబ్బింగ్ సినిమాలు నిర్మాతలను నిండా ముంచుతున్నాయి. ఈ ఏడాది సూర్య, కమల్‌హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి డిజాస్టర్స్‌గా నిలిచాయి. తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలకు భారీగా నష్టాలు మిగిల్చాయి.
సూర్య కంగువ… రెట్రో…
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. సూర్య హీరోగా నటించిన కంగువ, రెట్రో నిర్మాతలకు గట్టి షాకిచ్చాయి. సూర్యకు ఉన్న క్రేజ్ కారణంగా తెలుగులో కంగువ ఇరవై ఐదు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్‌గా ఉండటంతో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ పది కోట్ల లోపే కలెక్షన్స్ దక్కించుకున్నది. నిర్మాతలకు పదిహేను కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది. రెట్రో మూవీది అదే పరిస్థితి. ఈ సినిమాను తెలుగులో సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తెలుగులో డబ్ అయిన సూర్య మూవీస్‌లో అతి తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన రెట్రో మూడున్నర కోట్లలోపే వసూళ్లను రాబట్టి నిరాశను మిగిల్చింది.
థగ్‌లైఫ్…
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా తెలుగులో థగ్‌లైఫ్ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. కానీ ఈ గ్యాంగ్‌స్టర్ మూవీలో మణిరత్నం మార్కు, మ్యాజిక్ మిస్సవ్వడంతో థగ్‌లైఫ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తెలుగులో 12 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రెండు కోట్ల కలెక్షన్స్‌ను అతి కష్టంగా రాబట్టింది. తెలుగు నిర్మాతలకు పది కోట్ల మేర నష్టాలను మిగిల్చింది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 కూడా నిర్మాతలకు గట్టిషాకే ఇచ్చింది. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సీక్వెల్ మూవీ 12 కోట్ల లోపే కలెక్షన్స్ దక్కించుకున్నది. యాభై శాతం కూడా రికవరీ సాధించలేకపోయింది.
వార్ 2 50 కోట్లు లాస్…
వార్ 2 మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్‌కు ధీటుగా ఈ సినిమా బిజినెస్ చేసింది. దాదాపు 80 కోట్లకు ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా వార్ 2 బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది నాగవంశీకి వార్ 2 యాభై కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లు ప్రచారం జరుగుతోంది. వార్ 2కు పోటీగా రిలీజైన మరో డబ్బింగ్ మూవీ తెలుగు వెర్షన్ కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోవడం గమనార్హం.
అజిత్, మోహన్‌లాల్ సినిమాలు కూడా…
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, పట్టుదల, మోహన్‌లాల్ లూసిఫర్ 2, విక్రమ్ వీర ధీర సూరన్ 2, ధనుష్ జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ ఏడాది రిలీజైన డబ్బింగ్ సినిమాల్లో డ్రాగన్, మార్కోతో పాటు ఛావా మాత్రమే లాభాలను సొంతం చేసుకున్నాయి.
Also Read – Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేశ్ మండపంలో గర్భిణి ప్రసవం..


