Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార చాప్టర్ వన్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. వరల్డ్ వైడ్‌గా అరవై కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. కాంతారకు ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి ఈ సినిమాను రూపొందించారు. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా కాంతార చాప్టర్ వన్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. కాంతార మూవీలో భూతకోళ గురించి ఎక్కువగా చూపించగా.. ఈ ప్రీక్వెల్‌లో పంజుర్లి, గుళిగ వంటి వందల ఏళ్ల క్రితం నాటి ఆచారాలను ఆవిష్కరించారు రిషబ్ శెట్టి. ఈ ఆచారాల వెనకున్న చరిత్ర ఏమిటి? అసలు ఈ పదాలకు అర్థం ఏమిటన్నది ఆడియెన్స్‌లో ఆసక్తికరంగా మారింది.
భూతకోళ…
కర్ణాటకలోని దక్షిణ కోస్తా ప్రాంతాలైన మంగుళూరు, ఉడిపి, కుందాపురల్లో భూతకోళ కళ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రకృతి శక్తులను ఆరాధిస్తూ భూతకోళను ప్రతి ఏట కర్ణాటక ప్రాంత ప్రజలు నిష్టగా జరుకుంటారు. ఇది ఒక రకమైన దైవారాధనే. ఈ భూతకోళలో దైవం మనిషిలోకి ప్రవేశించి సమస్యలను పరిష్కరించడమే కాకుండా తీర్పులు కూడా ఇస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. భవిష్యత్తులో జరగబోయే అనర్థాలు, విపత్తుల విషయంలో ప్రజలను అప్రమత్తులను చేస్తుందట. దాదాపు 3000 ఏళ్ల క్రితమే భూతకోళ ఆచారం మొదలైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తాము పండించే పంటలను, తమకు జీవనాధారమైన అడవులను దొంగలు, దుష్ట శక్తుల బారి నుంచి కాపాడమని దేవతలను ఆరాధించడమే ఈ భూతకోళ ఉద్దేశమని కన్నడంలో కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాంతారతో పాటు కాంతార చాప్టర్ వన్‌లోనూ రిషబ్ శెట్టి ఇదే కథను చెప్పారు.
Also Read – Rukmini Vasanth: రష్మికని రుక్మిణి రీప్లేస్ చేస్తుందా?
శివుడి అంశ..
కాంతార చాప్టర్ వన్‌లో పంజర్లి, గుళిగ అనే పదాలు ఎక్కువగా వినిపించాయి. పంజర్లి అంటే వరహా రూపం, గుళిగ అంటే మహా శివుడి అంశ అని అర్థం. పార్వతీ దేవి ముద్దుగా పెంచుకున్న అడవి పందిని ఓ సారి శివుడు కోపంతో వధించాడట. పార్వతి దేవి కోరిక మేరకు ఆ అడవి పందికి తిరిగి ప్రాణం పోసిన శివుడు.. కొన్ని శక్తులు ఇచ్చి పంజర్లి దేవగా తులు ప్రాంతానికి పంపించాడని కొన్ని గాథలు చెబుతుంటాయి. అదే అడవి పందుల బారి నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి తులు ప్రాంతం ప్రజలు పంజర్లిని పూజిస్తుంటారు.
క్షేత్ర పాలకుడిగా…
గుళిగ పదం గురించి కూడా తులు ప్రాంతంలో అనే కథనాలు, గాథలు వినిపిస్తుంటాయి. శివుడు, మహావిష్ణువు అంశతో భూమిపైకి వచ్చిన గులిగ అనే రాయి ఆలయాలకు క్షేత్రపాలకుడిగా ఉందని చెబుతుంటారు. ప్రజల సమస్యలను, కష్టాలను గుళిగ తీరుస్తుందని అంటుంటారు. గుళిగకు కోపం ఎక్కువని అంటుంటారు. గుళిగను అవమానించిన వారు, తప్పుచేసిన వారు వెంటనే రక్తం కక్కుకొని చనిపోతారని చెబుతుంటారు. భూతకోళ నిర్వహించినప్పుడు పంజర్లి, గుళిగ దేవుళ్లను కొలవడం తులునాడులో ఆనవాయితీ. ఈ అంశాలను కాంతార సినిమాలో రిషబ్ శెట్టి చూపించాడు. కాంతార చాప్టర్ వన్‌కు కొనసాగింపుగా కాంతార సీక్వెల్ కూడా రాబోతుంది.
Also Read – Nidhhi Agerwal: పవర్ స్టార్ మాటలు నన్ను హత్తుకున్నాయి..


