Champion: శ్రీకాంత్ కుమారుడు, యంగ్ హీరో రోషన్ మేక నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’. ఈ మూవీ టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యింది. ‘పెళ్లి సందడి’ సినిమాతో సరైన హిట్ అందుకోలేకపోయిన రోషన్, ఈసారి ‘ఛాంపియన్’ తో మాత్రం గట్టిగా నిలదొక్కుకునేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఫుట్‌బాల్ ఆట నేపథ్యంతో తెరకెక్కినట్లు మేకర్స్ ముందే చెప్పారు.
విడుదలైన టీజర్ చూస్తుంటే, ఒక ఫుట్ బాల్ ప్లేయర్ బ్రిటిష్ వాళ్ళతో ఒక ఫుట్ బాల్ ఆట ఆడితే ఎలా ఉంటుందో అనేది క్లియర్ గా చూపించారు. టీజర్‌లోని విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి, ముఖ్యంగా టీజర్ చూస్తుంటే ఒక వింటేజ్ ఫీల్ వచ్చింది. ఇది ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా అని స్పష్టమవుతోంది. బ్రిటిష్ పరిపాలన కాలం నాటి దృశ్యాలు టీజర్‌లో కనిపిస్తున్నాయి. మరి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉన్న హీరోకు, బ్రిటిష్ వాళ్లకు మధ్య ఉన్న గొడవ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా ట్రైలర్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. రోషన్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా మెరుగ్గా కనిపించాయి.
ఈ సినిమాను స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి, సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ అద్వైతం ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. క్రిస్మస్ స్పెషల్ గా ఈ మూవీ డిసెంబర్ 25 న రిలీజ్ కాబోతుంది.


