బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలం పేర్లు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. 1998లో చోటు చేసుకున్న కృష్ణ జింకల వేట కేసు. తాజాగా రాజస్థాన్ హైకోర్టు ఈ కేసులో కీలకమైన పలు అప్పీళ్లను విచారణకు జాబితాలోకి చేర్చాలని ఆదేశించడంతో, ఇది మరోసారి చర్చకు తెరలేపింది. జూలై 28న ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇందులో సల్మాన్ ఖాన్ వేసిన పిటిషన్‌తో పాటు, ఇతర నలుగురు తారలను నిర్దోషులుగా విడిచిపెట్టడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీళ్లపై కూడా విచారణ జరగనుంది.
కానీ ఈ కేసు కేవలం చట్టపరమైనది మాత్రమే కాదు. దీని వెనుక బిష్ణోయ్ తెగ అనుభూతులు, విశ్వాసాల బలమైన నేపథ్యం ఉంది. బిష్ణోయ్ తెగకి కృష్ణ జింకలంటే ప్రాణం.15వ శతాబ్దంలో గురు జంభేశ్వర్ (జంబాజీ) బిష్ణోయ్ తెగకు స్థాపకులు. ఆయన 29 జీవన సూత్రాలను రూపొందించగా, వాటిలో కీలకమైనది వన్యప్రాణుల రక్షణ. ఆయన అంతిమంగా తన పునర్జన్మ కృష్ణ జింకలుగా అవుతానని చెప్పిన నమ్మకంతో, ఈ తెగ వారి కృష్ణ జింకల్ని దేవతలుగా పూజించటం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే జింకల వేట సల్మాన్ ఖాన్ చేసిన పెద్ద నేరంగా మారింది. ప్రత్యేకంగా బిష్ణోయ్‌ల దృష్టిలో అతను ఘోరమైన అపరాదిగా నిలిచిపోయాడు. అప్పటి నుంచి బిష్ణోయ్ తెగ అతనిపై కోపంగా ఉంటూ వస్తోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను టార్గెట్ చేశాడు. సల్మాన్ ఖాన్ ను చంపుతానని లారెన్స్ బిష్ణోయ్ బహిరంగంగానే ప్రకటించడం, ఇటీవలే ఆయన గ్యాంగ్ బాబా సిద్ధిఖీని టార్గెట్ చేయడం చేశాడు. కృష్ణ జింకల పట్ల ఉన్న ఈ భావోద్వేగ బంధం, భక్తి… ఒక్క సింబాలిక్ చర్యలకే కాకుండా, క్రిమినల్ పరిణామాలకు దారి తీస్తుండటం బాధాకరం కానీ వాస్తవం.
బిష్ణోయ్‌ల విశ్వాసం ప్రకారం, చనిపోయిన వారి ఆత్మలు కృష్ణ జింకలుగా పునర్జన్మిస్తాయని నమ్మకం. ఈ అంశాన్ని UCLA కు చెందిన చరిత్రకారుడు వినయ్ లాల్ కూడా పరిశోధనల ద్వారా ప్రస్తావించారు. అందుకే ఈ జింకల వేట బిష్ణోయ్ తెగ జీవితాన్ని తాకిన ఘాతుకంగా మారింది. ఈ కేసులో న్యాయపరిణామాలు ఎలా మారతాయన్నది చూడాలి. కానీ జింకల పట్ల ఈ తెగకున్న అనుబంధం, నమ్మకాలు మాత్రం భారత సంప్రదాయ విశ్వాసాల బలం ఏ స్థాయిలో ఉంటాయో మరోసారి చూపిస్తున్నాయి.