Samantha: ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా కొనసాగింది సమంత. ఏడాదికి నాలుగైదు సినిమాలతో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోల సినిమా అంటే సమంత పేరు మొదట వినిపించేది. సినిమాల పరంగానే కాకుండా రెమ్యూనరేషన్‌లోనే సమంతనే టాప్‌లో నిలిచింది. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల కారణంగా సమంత డౌన్ ఫాల్ మొదలైంది. 2023లో రిలీజైన ఖుషి తర్వాత హీరోయిన్‌గా ఒక్క సినిమా చేయలేదు. రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న సమంతకు టాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో తానే స్వయంగా నిర్మాతగా మారి మా ఇంటి బంగారం పేరుతో గత ఏడాది ఓ క్రైమ్ కామెడీ మూవీని అనౌన్స్ చేసింది. ఈ సినిమాను ప్రకటించి ఏడాది దాటినా ఇప్పటివరకు షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. మా ఇంటి బంగారం తర్వాత సెట్స్‌పైకి వచ్చిన సమంత సొంత సినిమా శుభం థియేటర్లలో రిలీజై హిట్టు కొట్టింది. దాంతో మా ఇంటి బంగారం సినిమాను సమంత పక్కన పెట్టినట్లు వార్తలొచ్చాయి.
ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ ఎట్టకేలకు ఈ క్రైమ్ కామెడీ మూవీ సెట్స్‌పైకి వచ్చినట్లు సమాచారం. దీపావళి రోజు సెలైంట్‌గా మా ఇంటి బంగారం సినిమా షూటింగ్‌ను సమంత మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నట్లు టాక్. విరామం లేకుండా నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ను జరిపేలా సమంత అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మా ఇంటి బంగారం మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోంది.
1980 బ్యాక్‌డ్రాప్‌లో మా ఇంటి బంగారం మూవీ రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ హౌజ్ వైఫ్ క్యారెక్టర్‌లో సమంత కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. డిఫరెంట్ షేడ్స్‌తో సమంత క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా సాగుతుందట. సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో తెలుగులో వస్తున్న మూడో మూవీ ఇది. గతంలో వీరిద్దరు కలిసి జబర్ధస్థ్, ఓ బేబీ సినిమాలు చేశారు. ఓబేబీ హిట్టవ్వగా.. జబర్ధస్థ్ డిజాస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లతో ఫేమస్ అయ్యింది సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ హనీ బన్నీ తర్వాత ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ పేరుతో హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్‌లో ఒకరైన రాజ్ నిడిమోరును సమంత పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాజ్ నిడిమోరు ఫ్యామిలీ మెంబర్స్‌తో సమంత దీపావళి వేడుకలను జరుపుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.


