టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. “సిటాడెల్ హనీ బన్నీ” వెబ్ సిరీస్ తో పాటు “రక్త బ్రహ్మాండ్”, మా ఇంటి బంగారం, శుభం వంటి సినిమాలతో బిజీగా ఉన్న సమంత, తాజాగా ఆసుపత్రి బెడ్ పై సెలైన్ బాటిల్ తో దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2021లో నాగ చైతన్యతో విడాకుల తర్వాత “మయోసైటిస్” అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత, చికిత్స నిమిత్తం సినిమాలకు కొంత విరామం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె తాజా ఆసుపత్రి ఫోటోలు అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అయితే, కొందరు నెటిజన్లు ఇది ఆమె నటిస్తున్న ఏదైనా సినిమా షూటింగ్ లో భాగం కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఆసుపత్రి బెడ్ ఫోటోకి సంబంధించి ది వెల్ నెస్ కో ఇంటర్నేషనల్ అనే వెల్ నెస్ సెంటర్ లో తాను రికవరీ అవుతున్నట్లు సమంత క్యాప్షన్ ఇచ్చింది. సమంత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.