Samantha: విడాకులతో పాటు వ్యక్తిగత జీవితంలోని సమస్యలపై సమంత మరోసారి రియాక్ట్ అయ్యింది. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2025 ఈవెంట్‌కు ఓ గెస్ట్‌గా సమంత హాజరైంది. ఈ కార్యక్రమంలో నాగచైతన్యతో విడాకులతో పాటు మయోసైటీస్ కారణంగా తనకు ఎదురైన కష్టాలను బయటపెట్టింది సమంత. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ గురించి మాట్లాడుతున్న సమయంలో సమంత ఎమోషనల్ అయ్యింది. లైఫ్‌లో తాను తప్పులు చేసినట్లు సమంత చెప్పింది. ‘నేను పర్ఫెక్ట్ కాదు. కొన్ని తప్పులు చేశా. ఇప్పుడిప్పుడే బెటర్ పర్సన్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను’ అని తెలిపింది.
ఓపెన్ సీక్రెట్…
‘‘నా వ్యక్తిగత జీవితం, నేను ఎదుర్కొన్న కష్టాలు అన్ని ఓపెన్ సీక్రెట్. విడాకులు, మయోసైటీస్ కారణంగా నేను ఎంత స్ట్రగుల్ అయ్యానన్నది అందరూ చూశారు. నా జీవితంలో ఏం జరిగినా అన్ని ప్రజల సమక్షంలో బహిరంగంగానే జరిగాయి. వాటి వల్ల సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్, జడ్జ్‌మెంట్‌లు ఎదుర్కొన్నా. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలాగే జడ్జ్ చేస్తారని మెల్లమెల్లగా అర్థం చేసుకున్నా. నా జీవితాన్ని పూర్తిగా చక్కదిద్దుకున్నానని అనుకోవడం లేదు. నేను పరిపూర్ణంగా ఉన్నట్లు ఎవరికి చూపించాల్సిన పనిలేదు. నా జీవితంలో సెట్ కానివి చాలానే ఉన్నాయి’’ అని సమంత పేర్కొన్నది.
ఓవర్‌నైట్‌లో స్టార్…
ఈ కార్యక్రమంలో ఏ మాయ చేశావే సక్సెస్ తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి సమంత కామెంట్స్ చేసింది. ‘‘ఏ మాయ చేశావే అంగీకరించడానికి ముందు నా దగ్గర ఏం లేదు. కుటుంబం ఎన్నో కష్టాల్లో ఉంది. సినిమా రిలీజ్ తర్వాత అన్ని మారిపోయాయి. ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయా. పేరు, డబ్బు, ప్రశంసలు చాలానే వచ్చాయి. కానీ ఆ టైమ్‌లో వాటిలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు’’ అని చెప్పింది. అలాగే ‘పుష్ప 2’లో ఊ అంటావా పాటలో నటించడానికి గల కారణాలను సమంత రివీల్ చేసింది. ‘ఓ యాక్టర్‌గా నాకు నేను విధించుకున్న సవాల్ ఆ సాంగ్ అని చెప్పింది. నన్ను నేను సెక్సీగా ఎప్పుడూ అనుకోను. నాకు బోల్డ్ రోల్స్ ఎవరూ ఆఫర్ చేయలేదు. అలాంటి సాంగ్స్ నేను చేయగలనో లేదో చూడాలనే ఊ అంటావా పాటను అంగీకరించాను. అంత పెద్ద హిట్టవుతుందని అస్సలు అనుకోలేదు’ అని సమంత అన్నది.


