Samantha Interview: హీరోయిన్ గా కెరీర్, గ్లామర్, ఫ్యాన్స్ గురించి స్టార్ హీరోయిన్ సమంత మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన జీవితానుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను పంచుకున్నారు. సినీ రంగంలో కథానాయికగా కెరీర్, గ్లామర్, అభిమానుల ఆదరణ వంటివేవీ శాశ్వతం కావనే జీవిత సత్యాన్ని తాను గ్రహించినట్లు వెల్లడించారు. తాను ఎదుర్కొన్న సమస్యలే తనకు ఎన్నో విషయాలను నేర్పించాయని ఆమె పేర్కొన్నారు. తాను కేవలం ఒక నటిగా మిగిలిపోవాలని కోరుకోలేదని, అంతకుమించి సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపాలని ఆకాంక్షించినట్లు సమంత తెలిపారు. ఒక నటిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అదృష్టంతో పాటు మరెన్నో అంశాలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. సమంత చేసిన ఈ తాత్విక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: PM Modi 75th birthday: మోదీకి శుభాకాంక్షల వెల్లువ.. పోప్ లియో ప్రత్యేక ఆశీస్సులు
ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నా..
తన జీవితంలో ఎన్నో దాటుకొని ఈ స్థాయికి వచ్చినట్లు సమంత చెప్పారు. ‘‘ఆరోగ్య సమస్య రానంత వరకూ మనం చిన్న చిన్న వాటిని కూడా ఇబ్బందులుగానే చూస్తాం. వంద సమస్యలున్నట్లు అనిపిస్తుంటుంది. కానీ, ఒక్కసారి అనారోగ్యానికి గురైతే దాని ముందే ఏదీ పెద్దదిగా అనిపించదు. అప్పుడు దృష్టంతా ఆరోగ్యంపైనే పెడతాం. ప్రస్తుతం నేను నిద్ర, ఆహారం, మానసిక ప్రశాంతతపైనే ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నా. గతంతో పోలిస్తే వీటి విషయంలో కఠినంగా ఉంటున్నా. అందుకే నేను ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాను’’ అని ఆమె చెప్పుకొచ్చారు. కెరీర్ పరంగాను మార్పులు చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్ని సినిమాలు చేశామనేది కాదని.. ఎంత మంచి చిత్రాలు తీశామనేది ముఖ్యమన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై ఒకేసారి ఐదు సినిమాలు చేయనన్నారు.
Read Also: Bigg Boss Voting: ఓటింగ్ లో దూసకుపోతున్న కమెడియన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే?
నెమ్మదించిన కెరీర్..
గత కొంతకాలంగా సమంత కెరీర్ కాస్త నెమ్మదించిన విషయం తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడి కోలుకున్న తర్వాత, ఆమె మునుపటిలా వరుస చిత్రాలతో బిజీగా లేరు. ఇటీవల ‘శుభం’ అనే చిత్రంతో నిర్మాతగా మారి, అందులో అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం సమంత ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ (Rakht Brahmand)లో నటిస్తున్నారు. దర్శకద్వయం రాజ్, డీకే (Raj and DK) దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆదిత్యరాయ్ కపూర్, సమంతతో పాటు అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఇది రూపొందుతోంది.తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆమె నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఓ తమిళ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నారని వార్తలు వస్తున్నా, వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. సమంత మళ్లీ వెండితెరపై కనిపించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.


