Star Heroines: పాన్ ఇండియన్ కల్చర్ వల్ల హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా లాభపడుతోన్నారు. ఇది వరకు ఒకే ఇండస్ట్రీకి పరిమితమై సినిమాలు చేసే ముద్దుగుమ్మలు ఇప్పుడు అన్ని భాషల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఓ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గితే మరో భాషపై ఫోకస్ పెడుతూ ఆఫర్లు సొంతం చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో అచ్చ తెలుగు అమ్మాయిల కంటే మలయాళం, కన్నడ బ్యూటీలదే డామినేషన్ కనిపిస్తుంటుంది. ప్రతి ఏటా పదుల సంఖ్యలో ఇతర భాషలకు చెందిన హీరోయిన్లు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ నవతరం తారల జోరుతో తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ల హవా చాలా తగ్గింది. ఒకప్పుడు టాలీవుడ్‌లో నంబర్‌వన్ హీరోయిన్లుగా వెలుగొందిన సమంత, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాతో పాటు మరికొందరు నాయికలు టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి చాలా కాలమైంది. వీరు కొత్త సినిమా కబురు వినిపించేది ఎప్పుడన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
సమంత వాట్ నెక్స్ట్…
తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగింది సమంత. మనం, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌బస్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, పరాజయాల కారణంగా కొన్నాళ్లుగా అవకాశాల రేసులో వెనుకబడింది సమంత. తెలుగులో 2023లో రిలీజైన ఖుషి హీరోయిన్‌గా సమంత చివరి మూవీ. అప్పటి నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది సమంత. ఇటీవల రిలీజైన శుభంలో గెస్ట్ రోల్‌లో మెరిసింది. ఈ సినిమాను తానే స్వయంగా నిర్మించింది. ఖుషి రిలీజై రెండేళ్లయినా హీరోయిన్‌గా నెక్స్ట్ తెలుగు మూవీకి సంబంధించి సమంత నుంచి ఎలాంటి కబురు రాలేదు.
కీర్తి సురేష్…
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కీర్తి సురేష్ కనిపించి చాలా కాలమే అవుతోంది. భోళా శంకర్ తర్వాత తెలుగులో కొత్త సినిమా ఏది అంగీకరించలేదు కీర్తి సురేష్. కొత్త కథల కోసం ఎదురుచూస్తుంది. మంచి కథ, పాత్రతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తోంది కీర్తి సురేష్. ఇటీవల ఓటీటీలో ఉప్పుకప్పురంబు పేరుతో కీర్తి సురేష్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది.
కాజల్…తమన్నా…
తమన్నా, కాజల్ టాలీవుడ్‌లో టాప్ స్టార్స్‌గా వెలుగొందారు. చిరంజీవి, బాలకృష్ణ నుంచి రామ్‌చరణ్, ఎన్టీఆర్ వరకు రెండు జనరేషన్ల స్టార్స్‌తో సినిమాలు చేశారు. కొత్త హీరోయిన్ల తాకిడితో ఈ ముద్దుగుమ్మల క్రేజ్ డౌన్ అయ్యింది. సత్యభామ తర్వాత హీరోయిన్‌గా తెలుగులో సినిమా చేయలేదు కాజల్. రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. భోళా శంకర్ తర్వాత టాలీవుడ్‌కు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన తమన్నా.. ఓదెల 2తో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మైథలాజికల్ మూవీతో మళ్లీ టాలీవుడ్‌లో బిజీ కావాలని కలలు కన్నది. ఓదెల 2 డిజాస్టర్‌తో మిల్కీ బ్యూటీ ఆశలు తీరలేదు. ఓదెల 2 తర్వాత తెలుగులో కొత్త సినిమాపై సంతకం చేయలేదు తమన్నా.
Also Read- Tollywood Updates: ముగిసిన సినీ కార్మికుల సమ్మె.. షూటింగ్స్ షురూ
బాలీవుడ్‌కు షిఫ్ట్
తండేల్‌తో పెద్ద విజయాన్ని దక్కించుకున్న సాయిపల్లవి నెక్స్ట్ తెలుగు మూవీ ఏమిటన్నది ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సాయిపల్లవి తెలుగులో అవకాశాలను రిజెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అరవిందసమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో వంటి సక్సెస్‌లతో లక్కీస్టార్‌గా మారింది పూజా హెగ్డే. అప్పట్లో స్టార్ హీరో సినిమా అంటే పూజా హెగ్డే పేరు వినిపించేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో టాలీవుడ్‌కు దూరమైంది. ఆచార్య తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు పూజా హెగ్డే. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తెలుగులోకి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఎదురుచూస్తోంది.


