సంక్రాంతి పండుగకు విడుదలవుతున్న సినిమాలన్నిటికీ ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్ని సినిమాల టికెట్ రేట్లు(Ticket Prices) పెంచడంతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్'(Game Changer) మూవీ టికెట్ రేట్లు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj), ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam)సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించారు.
నటసింహం బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాకు ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షోకు, తొలి రోజు నుంచి రెండు వారాల వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. ఇక బెనిఫిట్ షోకు టికెట్ ధర రూ.500 రూపాయలు, రెండు వారాల పాటు మల్టీప్లెక్సుల్లో రూ.135, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.110 పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.
ఇక వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రిలీజ్ రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు 5 షోలకు అనుమతులు మంజూరు చేసింది. అలాగే మల్టీప్లెక్సుల్లో రూ.125, సింగిల్ స్క్రీన్స్ లో రూ.100 పెంచుకునేలా అవకాశం ఇచ్చింది.
ఇదిలా ఉంటే ‘గేమ్ ఛేంజర్’ మూవీకి జనవరి 9వ తేదీ అర్థరాత్రి 1 గంటలకు స్పెషల్ బెనిఫిట్ షో వేసుకునే అవకాశం కల్పించారు. ఈ షోకు జీఎస్టీతో కలిపి రూ.600లకు టికెట్ రేటు ఫిక్స్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయ్యే 10వ తేదీన 6 షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఆరోజు ఉదయం 4 గంటల ఆట నుంచి షో వేసుకునేందుకు అంగీకారం తెలిపారు. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోజుకు ఐదు షోస్ వేసుకునే అవకాశం కల్పించారు. ఈ రెండు వారాలు మల్లీప్లెక్స్‌లకు జీఎస్టీతో కలిపి రూ.175.. సింగిల్ స్క్రీన్ ధియేటర్లకు రూ.135 పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు.
కాగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే టికెట్ రేట్లు పెంపు.. బెనిఫిట్ షోలపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.