Santosham Awards: హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో శనివారం సాయంత్రం సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిపారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే అవార్డ్స్ ఫంక్షన్‌కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించారు.
మురళీమోహన్, నిర్మాత కేఎస్ రామారావు
ఈ వేడుకకు సీనియర్ నటుడు మురళీమోహన్, నిర్మాత కేఎస్ రామారావు, నిర్మాత ఏడిద రాజా, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ, స్పాన్సర్స్ సూర్య సెమ్ డైరెక్టర్లు అనిల్, డాక్టర్ సురేష్ బాబు, వి.వి.కె. హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వళ్లూరు విజయకుమార్ తదితరులు హాజరయ్యారు. శ్రీ విజయ వారాహి మూవీస్ కో-స్పాన్సర్‌గా, ఆదిత్య మ్యూజిక్ మ్యూజిక్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నాయి.
24 సంవత్సరాలుగా నిరంతరంగా..
ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ, సురేష్ కొండేటితో తనకు ఉన్న దీర్ఘకాల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కష్టపడే వ్యక్తి అని, 24 సంవత్సరాలుగా నిరంతరంగా సంతోషం మేగజైన్ ద్వారా అవార్డ్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరు ప్రశంసనీయం అని తెలిపారు.
వన్ మాన్ షోలా…
నిర్మాత ఏడిద రాజా, సురేష్ కొండేటి ఏ కార్యక్రమం చేసినా వన్ మాన్ షోలా చేస్తారని, ఈసారి కూడా అవార్డ్స్ ఈవెంట్‌ను విజయవంతం చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
నిర్మాత కేఎస్ రామారావు, ప్రభుత్వాలు కూడా ఈవెంట్లకు సమయం తీసుకునే పరిస్థితుల్లో, సురేష్ కొండేటి లాంటి వ్యక్తి స్వతంత్రంగా ఇంతకాలం అవార్డ్స్ ఫంక్షన్లను విజయవంతంగా జరిపించడం అసాధారణం అని అభిప్రాయపడ్డారు. ఆయన ఎప్పుడూ సమస్యల ముందు తలవంచకుండా, చిరునవ్వుతో ముందుకు సాగుతారని అన్నారు.
24 ఏళ్లుగా అవార్డ్స్
సీనియర్ నటుడు మురళీమోహన్, సంతోషం మేగజైన్ 24 ఏళ్లుగా అవార్డ్స్ కార్యక్రమాన్ని కొనసాగించడం విశేషమని, ఫిలింఫేర్ మినహా ఇతర మ్యాగజైన్లు ఇంతకాలం ఈవెంట్ నిర్వహించలేదని అన్నారు. సురేష్ కష్టపడి ఈ అవార్డ్స్‌ను నిలబెట్టారని, ఈసారి కూడా ఘనంగా జరిగేలా అందరూ తోడ్పడతామని హామీ ఇచ్చారు.
స్పాన్సర్ వళ్లూరు విజయకుమార్, సంతోషం అవార్డ్స్‌తో అనుబంధం తనకు ప్రత్యేక అనుభూతి కలిగించిందని, ఈ అవార్డ్స్ అనేక మందిని ప్రోత్సహించాయని తెలిపారు. ఈ నెల 16న జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగే ప్రధాన ఈవెంట్‌ను మరింత ఘనంగా చేయాలని కోరుకున్నారు.
సూర్య సెమ్ డైరెక్టర్లు అనిల్, డా. సురేష్ బాబు, సురేష్ కొండేటి పట్టుదలపై ప్రశంసలు కురిపించారు. వారు విద్యార్థి దశలో సంతోషం మేగజైన్ చదివిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
35 ఏళ్ల జర్నలిస్ట్ ప్రయాణంలో…
సంతోషం మేగజైన్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, 35 ఏళ్ల జర్నలిస్ట్ ప్రయాణంలో 85కి పైగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి, 16 సినిమాలు నిర్మించి, 600 సినిమాలకు పీఆర్‌గా పనిచేశానని తెలిపారు. 2002లో ప్రారంభమైన సంతోషం అవార్డ్స్‌ను కనీసం 25 ఏళ్లు కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. దుబాయ్ షార్జా క్రికెట్ స్టేడియంలో 40 వేల మంది మధ్య అవార్డ్స్ ఈవెంట్ నిర్వహించిన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఈవెంట్‌లో కొన్ని చిన్న సమస్యలు వచ్చినా, వాటిని పెద్ద సమస్యగా చూడలేదని, తనను అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి కూడా అందరి సహకారంతో అవార్డ్స్ వేడుకను అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పారు.


