B. Saroja Devi Passed Away: భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి, పద్మభూషణ్ గ్రహీత బి.సరోజాదేవి (87) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. సరోజాదేవి భారతీయ సినిమాకు చేసిన సేవలు ఎనలేనివి. 1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి, కేవలం 13 ఏళ్ల పిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1955లో విడుదలైన కన్నడ చిత్రం ‘మహాకవి కాళిదాసు’తో ఆమె తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఆమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు.
సరోజాదేవి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 1955 నుండి 1984 మధ్యకాలంలో సుమారు 29 సంవత్సరాల పాటు, ఆమె వరుసగా 161 సినిమాల్లో ప్రధాన కథానాయికగా నటించిన ఏకైక నటిగా చరిత్ర సృష్టించారు. ఈ రికార్డు ఆమె నటనకు, అంకితభావానికి నిదర్శనం. తెలుగు సినీ పరిశ్రమలో ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్‌ల వంటి దిగ్గజ నటులతో కలిసి పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.1959లో విడుదలైన పెళ్లిసందడి ఆమె తెలుగు సినిమా అయినప్పటికీ విడుదల ఆలస్యమైంది. దీంతో అంత కంటే ముందే, పాండురంగ మహత్యం, భూ కైలాస్ సినిమాలు విడుదలై మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.
Also Read – Trisha Glamour Pics: 40 ఏళ్లు దాటినా తగ్గని త్రిష అందం.. ట్రెండింగ్ లో లేటెస్ట్ పిక్స్..
అప్పట్లోనే ఐదు భాషల్లో నటించిన అతి కొద్ది మంది హీరోయిన్స్‌లో సరోజాదేవి ఒకరు. సినీ రంగంలో ఏడు పదుల అనుభవమున్న నటి. 2019లో నటించిన నటసార్వభౌమ ఆమె చివరి చిత్రం. తెలుగులో 2005లో ‘దేవీ అభయమ్’ ఆమె ఆఖరి చిత్రం. అలాగే రెండు టీవీ షోలు కూడా సరోజాదేవి చేశారు.
భారత సినీ రంగానికి సరోజాదేవి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను గౌరవించింది. 1969లో ఆమెకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించగా, ఆ తరువాత 1992లో దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌తో గౌరవించింది. ఈ పురస్కారాలు ఆమె సినీ రంగంలో చేసిన కృషికి, ప్రతిభకు దక్కిన గౌరవాలు. బి.సరోజాదేవి తన అద్భుతమైన నటనతో, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో దశాబ్దాల పాటు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఆమె మరణం భారత సినీ లోకానికి ఒక తీరని లోటు. ఆమె జ్ఞాపకాలు, ఆమె నటించిన చిత్రాల ద్వారా ఆమె ఎప్పటికీ సజీవంగా ఉంటారు.
Also Read – MLC 2025 : మేజర్ లీగ్ క్రికెట్ విజేతగా ముంబై ఇండియన్స్


