Siva Movie Re Release: తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. 1989లో విడుదలై కొత్త ధోరణి సృష్టించిన ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించగా, అక్కినేని నాగార్జున హీరోగా నటించారు. ఆ కాలంలో విప్లవాత్మకమైన కథా విన్యాసం, సాంకేతిక నాణ్యతతో ఈ సినిమా తెలుగు సినిమాల దిశను మార్చేసింది. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత ఈ మైలురాయి సినిమా సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
4కే రిజల్యూషన్, డాల్బీ అట్మోస్..
అన్నపూర్ణ స్టూడియోస్ పర్యవేక్షణలోనే ఈ చిత్రాన్ని 4కే రిజల్యూషన్, డాల్బీ అట్మోస్ సౌండ్‌తో రీమాస్టర్ చేసి గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రకటనతో సినిమా అభిమానులలో ఉత్సాహం నెలకొంది. ఈ తరం వారికి ఈ చిత్రాన్ని థియేటర్ అనుభవంలో చూపించాలనీ, అక్కినేని ఫ్యామిలీతో పాటు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా అనుకుంటున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/mahesh-babu-rajamouli-ssmb29-to-get-major-update-in-november/
నాగార్జున తన భావాలను పంచుకుంటూ, ‘శివ’ తన కెరీర్‌లో కీలక మలుపు తీసుకువచ్చిన చిత్రమని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా వల్లే తాను స్టార్ హీరోగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా గడిచినా ఇంకా ఈ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ తనను ఆశ్చర్యపరుస్తోందని చెప్పారు. అందుకే ఈ చిత్రాన్ని మళ్లీ అంగరంగ వైభవంగా విడుదల చేసి, పాత అభిమానులతో పాటు యూట్యూబ్ లేదా టీవీలో మాత్రమే చూసిన కొత్త ప్రేక్షకులు కూడా థియేటర్‌లో ఆ మాజిక్‌ను అనుభవించాలనుకుంటున్నారని వెల్లడించారు.
ఆధునిక ఏఐ టెక్నాలజీతో..
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రీ-రిలీజ్‌పై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాగార్జున, నిర్మాతలు తనపై ఉంచిన నమ్మకం కారణంగానే ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించిందని గుర్తుచేశారు. 36 ఏళ్ల తర్వాత కూడా ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మదిలో ఉండటం ఈ చిత్ర ప్రభావానికి నిదర్శనమని అన్నారు. ఆయన చెప్పిన ప్రకారం, ఒరిజినల్ మోనో సౌండ్‌ను నేటి సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక ఏఐ టెక్నాలజీతో డాల్బీ అట్మోస్ సౌండ్‌గా మార్చారు. ఇది ప్రేక్షకులకు ఇంతకు ముందు ఎప్పుడూ లేని వినికిడి అనుభూతిని అందిస్తుందని నమ్మకంగా తెలిపారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/telugu-film-chamber-shooting-ban/
రీ-రిలీజ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీజర్‌ను ఆగస్టు 14న సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ప్రదర్శనలతో పాటు థియేటర్లలో చూపించనున్నారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో ‘శివ’ హ్యాష్‌ట్యాగ్‌లు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి.
‘శివ’ చిత్రంలో నాగార్జునతో పాటు అమల, రఘువరన్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా నిలిచి, అనేక రికార్డులు సృష్టించింది. అదేకాలంలోనే ఇది మూడు నంది అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ సంభాషణల రచయిత (తనికెళ్ల భరణి) విభాగాల్లో ఈ అవార్డులు అందుకున్నాయి.


