Chinmayi Sripada: సోషల్ మీడియా వేధింపులపై సింగర్ చిన్మయి పోలీసులను ఆశ్రయించింది. తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు కంప్లైంట్ ఇచ్చింది. అసభ్యకరమైన మెసేజ్‌లతో విసిగిపోయానని, రాయడానికి వీలులేని పదాలతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని చిన్మయి ఫిర్యాదులో పేర్కొన్నది. తన పిల్లలను ట్రోలింగ్ లోకి లాగుతున్నారని, వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని చిన్మయి తెలిపింది. వేధింపులకు గురిచేస్తున్న వారికి శిక్ష పడేందుకు ఎన్ని ఏళ్లు అయినా తాను పోరాటం చేస్తూనే ఉంటానని చిన్మయి పేర్కొన్నది. నా అభిప్రాయాలు నచ్చకపోతే వదిలేయండి. అంతే కానీ పిల్లలు చచ్చిపోవాలనే కల్చర్ సరైందేనా అంటూ సోషల్ మీడియాలో చిన్మయి పోస్ట్ పెట్టింది. వీళ్లను అలాగే వదిలేయలేను. అందుకే వేధింపులను మీ దృష్టికి తీసుకొస్తున్నా అంటూ సజ్జనార్‌కు కంప్లైంట్ చేసింది చిన్మయి.
చిన్మయి కంప్లైంట్‌పై సీపీ సజ్జనార్ స్పందించారు. ఆమె ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. ఈ ట్రోలింగ్ విషయంలో నెటిజన్లు చిన్మయికే సపోర్ట్ చేస్తున్నారు. చిన్మయిని అసభ్యపదజాలంతో వేధించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ది గర్ల్‌ఫ్రెండ్ ప్రమోషన్స్‌లో మంగళసూత్రం విషయంలో చిన్మయి భర్త, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్‌తో ఈ వివాదం మొదలైంది. మంగళసూత్రం ధరించే విషయంలో చిన్మయిని తాను బలవంతపెట్టనని రాహుల్ రవీంద్రన్ అన్నాడు. మంగళసూత్రం ధరించాలా? వద్దా? అన్నది చిన్మయి ఇష్టానికే వదిలేస్తానని కామెంట్స్ చేశాడు. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన రాహుల్ రవీంద్రన్ వ్యాఖ్యలకు చిన్మయి సపోర్ట్ చేయడంతో నెటిజన్లు వీరిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇద్దరిని తెగ ట్రోల్ చేస్తున్నారు. చివరకు ఈ ట్రోల్స్ పోలీస్ కేసు వరకు వెళ్లాయి. ఈ ట్రోలర్స్‌పై పోలీసులు ఇప్పటికే కేసును నమోదు చేసినట్లు సమాచారం.
చిన్మయి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురికావడం ఇదే మొదటిసారి కాదు. సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, సమస్యలపై గతంలో ఆమె చేసిన ట్వీట్స్ చాలా సార్లు వైరల్ అయ్యాయి. వైరముత్తు, సింగర్ కార్తిక్‌లపై ఆరోపణలు చేసింది చిన్మయి. జానీ మాస్టర్ లాంటి వారికి అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులను ప్రోత్సహించినట్లేనంటూ ఇటీవల ఓ ట్వీట్ పెట్టింది. ఆమె ట్వీట్స్‌పై సపోర్ట్ కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి.
సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో చాలా ఏళ్లుగా కొనసాగుతోంది చిన్మయి. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది.
Also Read – Dragon: బీస్ట్ మోడ్‌లో ఎన్టీఆర్ – డ్రాగన్ కోసం యంగ్ టైగర్ రెడీ…


